జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ కార్ల తయారీ సంస్థ నుండి కొత్తగా ఎం760ఎల్ఐ ఎక్స్‌డ్రైవ్ కార్లు వస్తున్నాయి. ఇవి రెండు మోడల్స్ లో లభించనున్నాయి. ఎం760ఎల్ఐ ఎక్స్‌డ్రైవ్, ఎం760ఎల్ఐ ఎక్స్‌డ్రైవ్ వీ12 ఎక్సెలెన్స్ ఈ రెండు రకాలూ పెట్రోలు ఇంజిన్‌తో లభించనున్నాయి. వీటి ధరను రూ.2.27 కోట్లుగా నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. 3.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు గంటకు గరిష్ఠంగా 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పవాహ్ అన్నారు. మరింత మెరుగుపరిచిన బీఎండబ్ల్యూ 330ఐ సెడాన్ వాహనాన్ని కూడా సంస్థ విడుదల చేసింది. దీని ధరను రూ.44.90 లక్షల వరకు ఉన్నట్లు సంస్థ పేర్కొంది.