లండన్ భూగర్భ మెట్రో స్టేషన్లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడు పలువురు ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి. వెస్ట్ లండన్‌లోని పర్సన్స్ గ్రీన్ స్టేషన్లో పేలుడు సంభవించినట్లు యూకే మీడియా వర్గాలు వెల్లడించాయి. పర్సిన్స్ గ్రీన్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన కొద్ది సేపటికే పేలుడు సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షి అయిన ఓ మహిళ తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 8:20 ప్రాంతంలో ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ఓ బ్యాగులో నుంచే పేలుడు శబ్దం వచ్చిందని సదరు మహిళ తెలిపింది.
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భయబ్రాంతులకు గురైన జనం పరుగులు తీయడంతో స్వల్పంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో తాత్కాలికంగా స్టేషన్‌ను మూసేసినట్లు అధికారులు తెలిపారు.