Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ సీనియర్‌ నేత సుష్మా స్వరాజ్‌ ఇక లేరు..!

Category : national politics

బీజేపీ సీనియర్‌ నేత, ఆహార్యంలో నిండైన భారతీయత, ప్రత్యర్థులను సైతం మెప్పించే వాక్పటిమతో దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన నాయకురాలు.. విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ (67) ఇక లేరు. గుండె ఆగి (కార్డియాక్‌ అరెస్ట్‌) మంగళవారం రాత్రి మరణించారు. ఆమె రాత్రి 9.30-10 గంటల సమయంలో తనకు నలతగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా ఐదుగురు వైద్యులతో కూడిన బృందం ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు అత్యవసర చికిత్స చేసేందుకు సిద్ధమైంది. కానీ, ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారని, ఎయిమ్స్‌లో అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, హర్షవర్ధన్‌, ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా సుష్మను ఎయిమ్స్‌కు తరలించిన విషయం తెలియగానే అక్కడికి చేరుకున్నారు.

ఆమె ఇక లేరన్న వార్త తెలియడంతో పలువురు కేంద్రమంత్రులు, విపక్ష నేతలు ఎయిమ్స్‌ ఆస్పత్రికి చేరుకుని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుష్మాస్వరాజ్‌కు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సూరి ఉన్నారు. కొంత కాలం గా మధుమేహంతో బాధపడతున్న ఆమె కిడ్నీలు దెబ్బతినడంతో కొన్నాళ్లపాటు డయాలసిస్‌ చేయించుకున్నారు. ఇక 2016 డిసెంబరులో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆమె అనారోగ్యం కారణంగానే 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. అయితే ట్విటర్‌లో మాత్రం ఎప్పుడు చురుగ్గానే ఉంటారు. ఆమె మంగళవారం తుదిశ్వాస విడవడానికి రెండు గంటల ముందు కూడా ట్వీటర్ లో కశ్మీర్‌పై కీలక నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. రాత్రి భోజన సమయం వరకూ కూడా ఆమె టీవీ చూస్తూ గడిపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, సుష్మాస్వరాజ్‌ ఆకస్మిక మరణవార్త తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని అన్నారు. సేవే లక్ష్యంగా జీవించిన ఆమెను ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారన్నారు. ప్రజలతో చెరిగిపోని బంధాన్ని ఏర్పరుచుకున్న సుష్మ మరణం దేశానికి తీరని లోటన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా సుష్మాస్వరాజ్‌ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె మరణంతో భారత రాజకీయాల్లో ఓ గొప్ప అధ్యాయానికి తెరపడిందని అభివర్ణించారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే గొప్ప పార్లమెంటేరియన్‌ సుష్మాస్వరాజ్‌ ఇక లేరనే విషయం తెలిసి చాలా బాధ కలిగిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు. సుష్మాస్వరాజ్‌ మృతి బీజేపీకి, దేశ రాజకీయాలకు తీరని లోటని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షా అన్నారు. సీఎం కేసీఆర్‌ కూడా సుష్మాస్వరాజ్‌ మృతిపట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.