Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్..కేసీఆర్‌‌తో రాహుల్‌ టీమ్ రాయబారాలు...షాక్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు..!

Category : state politics

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. తాను ప్రధాని కావాలనే లక్ష్యంతో మద్దతు కోసం ప్రత్యర్థి అయిన సీఎం కేసీఆర్‌తో సంప్రదింపులు చేస్తున్నట్లు వస్తున్న వార్తలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు షాక్ అవుతున్నారు. అంతంత మాత్రమే ఉన్న తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన పార్టీలోకి లాక్కుని, ఇప్పడు ఏకంగా తమ పార్టీనే టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలనుకుంటున్న కేసీఆర్‌‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుంది. రేవంత్‌ రెడ్డి పదునైన విమర‌్శలతో, తనదైన స్టైల్లో కేసీఆర్‌పై విరుచుకుపడుతుంటే..సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఏకంగా ఫిరాయింపులపై నిరసనగా పాదయాత్ర చేస్తూ కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నాడు. ఇక విహెచ్ లాంటి సీనియర్ నాయకులు కూడా రోజూ కేసీఆర్, కేటీఆర్‌ల మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. అయితే కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌పై బీభత్సంగా పోరాటం చేస్తుంటే రాహుల్‌గాంధీ మాత్రం కేసీఆర్‌తో దోస్తీ కోసం ఉవ్విళ్లూరుతున్నాడు.

తాజాగా దేశంలో ఐదు విడతల పోలింగ్ పూర్తయ్యింది. బీజేపీకి 150కి మించి సీట్లు రావని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ తోపాటు దాని మిత్రపక్షాలైన ప్రాంతీయ పార్టీలకే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయన్న ఖచ్చితమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్‌కు, ఏపీలో వైసీసీకి మెజారిటీ ఎంపీ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఎలాగైనా ప్రధాని కావాలన్న లక్ష్యంతో ఉన్న రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్‌‌లతో దోస్తీకి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ఆరంభించారని సమాచారం. తాజాగా కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు టీఆర్ఎస్ ముఖ్యనేతతో సమావేశమై రహస్య చర్చలు సాగించినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ హిందూస్తాన్ టైమ్స్ పత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.

సదరు పత్రిక కేసీఆర్ సపోర్ట్ కోసం కాంగ్రెస్ రాయబారాలు నడుపుతున్నట్లుగా తెలిపింది. తాజాగా టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ ఒకరు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతతో ఈ మేరకు సమావేశమైనట్టు సమాచారం. రెండు పార్టీలకు చెందిన నేతలూ ఈ భేటీని ధ్రువీకరించినట్టు హిందూస్తాన్ టైమ్స్ తన కథనంలో స్పష్టం చేసింది. కాగా కేంద్రంలో ఈసారి ఎన్డీయే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా అధికారం సొంతం చేసుకునే పరిస్థితి లేదని, అలాగే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీల మద్దతు కచ్చితంగా అవసరంపడుతుంది. కానీ దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీకి అండగా ప్రస్తుతం డీఎంకే వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి. బీజేపీతో కేవలం శివసేన లాంటి రెండు మూడు పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ సరళిని పరిశీలించి కాంగ్రెస్ కేసీఆర్ తో సంప్రదింపులకు తెరతీసిందని విశ్వసనీయ సమాచారం.

వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే మెజారిటీ కోసం దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంపీ సీట్లు కీలకం కానున్నాయి. ఈ లెక్కన తెలంగాణలో కేసీఆర్ చెబుతున్నట్లు పదహారుకు, పదహారుకు గెలవకపోయినా, కనీసం 12 సీట్లు గెలిచే అవకాశం ఉంది. మిగిలిన సీట్లలో కాంగ్రెస్ , ఒక సీటులో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. మరో వైపు ఏపీలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ 16-22 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంది. దీంతో మెజారిటీ సీట్లు గెల్చుకుంటున్న టీఆర్ఎస్, వైసీపీపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు రాహుల్‌ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. ఆ కోవలోనే కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు, టీఆర్ఎస్ ఎంపీతో సమావేశమై, హంగ్ వస్తే కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సిందిగా కేసీఆర్‌ను ఒప్పించాల్సిందిగా కోరినట్లు సమాచారం. మరోవైపు కేసీఆర్‌‌కు కూడా ఎన్డీయేతో పెద్దగా సఖ్యత లేదు. మోదీ, అమిత్‌షాలు కూడా కేసీఆర్ తీరుపై అసహనంతో ఉన్నారట.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి సన్నిహితులైన కుమారస్వామిని, స్టాలిన్‌తో కేసీఆర్ సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. స్టాలిన్‌తో భేటీ కుదరకపోయినా కుమారస్వామితో కేసీఆర్ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారానికి మద్దతు అవసరమైతే తప్పనిసరిగా కాంగ్రెస్‌కు ఇస్తామని కేసీఆర్ కుమారస్వామికి చెప్పినట్లు టాక్. ఒక వేళ కేసీఆర్ సపోర్ట్‌తో రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే అవకాశం వస్తే.. తెలంగాణలో పార్టీకి అంతకంటే అవమానం ఉండదని, ఇక పార్టీని చేజేతులా కేసీఆర్‌కు అప్పగించడమే అని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆవేదన చెందుతున్నారు. రాహుల్ ప్రధాని పదవి కోసం తెలంగాణలో పార్టీని పణంగా పెడుతుంటే..కేసీఆర్ మాత్రం తన మద్దతుతో ఢిల్లీలో తమకు అనుకూల ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీతో, కాంగ్రెస్ అధిష్టానం దూత సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న వార్తలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.