Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో.. ఏం జరుగుతోందంటే..?

Category : state politics

గత ఎన్నికలతో పోలిస్తే చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందని వైసీపీ వర్గీయులు, కాదు.. ఊహించనంతగా పెరుగుతుందని టీడీపీ వర్గీయులు చెబుతున్నారు. ఇవి మాటలకే పరిమితం కాక బెట్టింగులు కాస్తున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు సుమారు 47,600 ఓట్లు మెజారిటీ లభించింది. అంతకుముందటి ఎన్నికల్లోు 70 వేల ఓట్ల మెజారిటీ లభించింది. మెజారిటీ తగ్గిన అంశాన్ని కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ప్రస్తావించి స్థానిక ప్రజలను నిష్టూరమాడేవారు. నాయకులనైతే బహిరంగ సభల్లోనే చెరిగేసేవారు. ఈసారి అలా కాకూడదని ముందు నుంచే నాయకులను అప్రమత్తం చేశారు. ఎక్కడా ఎటువంటి నిర్లక్ష్యం దొర్లకుండా నిరంతరం పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో పార్టీ శ్రేణులను గ్రామాలకు పరుగులు పెట్టించారు. దీనికి తోడు పసుపు-కుంకుమ వంటి జనరంజక సంక్షేమ పథకాలతో ప్రతి డ్వాక్రా మహిళల అకౌంట్లలో రెండు విడతలుగా ఏకంగా రూ.20 వేలు జమ అయింది.

అన్నదాతా సుఖీభవ, వృద్ధులకు, వికలాంగులకు పెంచిన పింఛను నగదు వంటివి దీనికి జత కూడాయి. దీంతో ఈనెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగులో ఈవీఎంలు మొరాయించినా, క్యూలలో గంటల తరబడి నిలబడి మరీ మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు అర్ధరాత్రి దాటుతున్నా పోలింగు బూత్‌లవద్ద వారు బారులు తీరారు. పోలింగు కూడా గణనీయంగా 85.25 శాతానికి పెరిగింది. దీంతో చంద్రబాబుకు మెజారిటీ 60 వేలు దాటుతుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంకంటే ఏమాత్రం మెజారిటీ తగ్గబోదని తటస్థులు సైతం విశ్లేషిస్తున్నారు. దీని ఆదారంగా టీడీపీ అనుకూల వర్గీయులు, తటస్థుల్లో అత్యధిక శాతం మంది చంద్రబాబు మెజారిటీ పెరగడం ఖాయమని బెట్టింగ్‌లు కాస్తున్నారు.

మరోవైపు పెరిగిన ఓటింగు శాతం ప్రభుత్వ వ్యతిరేకత వల్లేనని వైసీపీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబుమీద ఎంత ప్రేమ ఉన్నా, స్థానిక నాయకులపైన గల వ్యతిరేకత చాలా అధికమని, అందువల్లే మహిళలు క్యూలైన్లలో వేచివుండి మరీ వైసీపీకి అనుకూల ఓటు వేశారని ఈ వర్గాలు నమ్ముతున్నాయి. అందువల్ల చంద్రబాబు మెజారిటీ తగ్గడం ఖాయమని విశ్లేషిస్తున్నాయి. ఆమేరకు వైసీపీ అనుకూల వర్గీయులు బెట్టింగులు కాస్తున్నారు. ఏదో ఆషామాషీగా బెట్టింగులు కాదు వేలు, లక్షలు పందేలు కాస్తున్నారు. రూ.10 వేలనుంచి రూ.2 లక్షలదాకా కూడా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. అంతేకాదు.. ద్విచక్ర వాహనాలనూ పందెంలో ఒడ్డుతున్నారు.అంటే పందెంలో ఓడిపోయిన వారు తమ బైక్‌ను గెలిచిన వారికి బేషరతుగా ఇచ్చేయాలన్న మాట. ఈ బెట్టింగులేవీ నోటిమాటగా జరగడంలేదు. మధ్యవర్తులను పెట్టుకుంటున్నారు. తాము కాస్తున్న బెట్టింగులపై అగ్రిమెంట్లు రాసుకుని మరీ భద్ర పరుచుకుంటున్నారు.. మే నెల 23వ తేదీన ఈవీఎంలు తెరిస్తే తప్ప బెట్టింగు రాయుళ్ల అదృష్టదురదృష్టాలు ఎలా ఉన్నాయో ఎవరూ చెప్పే పరిస్థితైతే ఇప్పట్లో కనిపించడంలేదు.