ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న స్పోర్ట్స్‌లో క్రికెట్ కూడా ఒకటి. అయినా ఇప్పటికీ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు మాత్రం స్థానం దక్కలేదు. చివరిసారి 1900లో పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. మళ్లీ ఇన్నాళ్లకు 2024 ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌కు స్థానం కల్పించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భావిస్తున్నది. ఇదే విషయాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) దృష్టికి తీసుకెళ్లింది.
అయితే ఐవోసీ మాత్రం క్రికెట్ ఆడే ప్రముఖ దేశాలు ఓకే చెబితేనే బిడ్డింగ్ వేయాలని స్పష్టంచేసింది. ఆ లెక్కన బీసీసీఐ ఓకే చెబితేగానీ ఐసీసీ ఈ విషయంలో ముందడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై భారత్ బెట్టు చేస్తున్నట్లుంది. ఈ మధ్య ఆదాయ పంపిణీతోపాటు కొన్ని విషయాల్లో బీసీసీఐని ఐసీసీ తేలికగా తీసుకొంటూ ఉండడంతో ఇప్పుడు తన వచ్చినదని బీసీసీఐ ఐసీసీతో ఆడుకుంటున్నది.
నిన్నటి వరకు తమను తేలికగా తీసుకున్న ఐసీసీ ఇప్పుడు తమ అవసరం కోసం వచ్చి అడిగితే ఎలా అంగీకరిస్తామని బీసీసీఐలోని ఓ అధికారి స్పష్టంచేశారు. బోర్డులో చాలా మంది అధికారులు దీనిపై అంతగా ఆసక్తి చూపడం లేదని ఆయన అన్నారు. బీసీసీఐని ఒప్పిస్తేనే ఈ విషయంలో ఐసీసీ ముందడుగు వేయగలదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత సులువుగా కనిపించడం లేదు.
మరోవైపు క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేరిస్తే తమ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతామన్న ఆందోళన కూడా బీసీసీఐలో ఉంది. ఒకవేళ క్రికెట్ ఒలింపిక్స్‌లో చేరితే బీసీసీఐ కూడా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) కిందికి రావాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇన్నాళ్లూ ఎంజాయ్ చేసిన ఫ్రీడమ్‌ను బోర్డు కోల్పోతుంది. అందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించమని బోర్డు తేల్చి చెప్పింది.
అయితే ఒలింపిక్స్‌లో క్రికెట్ అవకాశాలను ఇప్పుడే కొట్టిపారేయలేమని, కాకపోతే ఈ నిర్ణయాన్ని తాము స్వతంత్రంగా తీసుకుంటాము తప్ప బలవంతంగా తమపై రుద్దితే ఊరుకోమని మరో అధికారి అన్నారు.