//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పంతం నెగ్గించుకున్నమనోహర్ ..

Category : sports

ప్రపంచ క్రికెట్‌లోనే అత్యధిక సంపన్న దేశంగా ఉంటూ, ప్రపంచ క్రికెట్ లో ఆధిపత్యాన్ని చూపుతున్న భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐసీసీ చైర్మన్‌గా భాద్యతలు స్వీకరించిన శశాంక్‌ మనోహర్‌ ఐసీసీలో చక్రం తిప్పిన భారత్ బోర్డును చావుదెబ్బ కొట్టాడు. అతడు ప్రతిపాదించిన సరికొత్త పాలనా వ్యవస్థ, ఆదాయ పంపిణీ నమూనాకు బుధవారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో జరిగిన ఓటింగ్‌లో ఆమోద ముద్రపడింది. పాలనా వ్యవస్థలో మార్పుల ఓటింగ్‌లో బీసీసీఐ 1-9తో ఓడింది. ఈ ప్రతిపాదనకు అనుకూలంగా మిగతా బోర్డులు ఓటు చేయగా బీసీసీఐ ప్రతినిధి అమితాబ్‌ చౌదరి ఒక్కడే వ్యతిరేకించాడు. ఆదాయ పంపిణీ నమూనాపై భారత్ బోర్డు అభ్యంతరాలను కూడా 2-8తో తిరస్కరించారు. శ్రీలంక క్రికెట్‌ నుంచి మాత్రమే బీసీసీఐ మద్దతు సంపాదించగలిగింది. దీనివలన భారత వాటా రూ. 3667 కోట్ల నుంచి సగానికి పడిపోతుంది.

గతంలో ప్రవేశపెట్టిన బిగ్‌-3 ఆదాయ పంపిణీ విధానాన్నిరద్దు చేసి, సభ్య దేశాలన్నిటికి సమాన ఆదాయ పంపిణీ చేయాలనీ మనోహర్ తీసుకొచ్చిన కొత్త విధానాన్ని బీసీసీఐ మొదటి నుండి వ్యతిరేకించింది. ఈ ప్రతిపాదను పాస్‌ కాకుండా అడ్డుకుంటామని, దానికి అవసరమైన మద్దతు కూడగట్టడానికి బీసీసీఐ ప్రయత్నించింది. దానికి అనుగుణంగానే జింబాబ్వే, బంగ్లాదేశ్‌, శ్రీలంక బోర్డులతో చర్చలు నడిపి తగిన మద్దతు కూడా కూడగట్టింది. కానీ చివరి సమయంలో జింబాబ్వే, బంగ్లాదేశ్‌లు హ్యాండిచ్చాయి. మన మద్దతు ఐసీసీకి వెళ్లిన మనోహర్ ఇప్పుడు మనకే ప్రతికూలంగా మారాడు. మన కంట్లో మన వేలితో పొడుచుకున్నట్లయింది.

ఛాంపియన్స్‌ ట్రోఫీని బహిష్కరిస్తారా?

కొత్త విధానాలను పాస్ కాకుండా అడ్డుకోవటంతో విఫలమైన బీసీసీఐ ముందున్న తొలి ప్రత్యామ్నాయం ఛాంపియన్స్‌ ట్రోఫీని బహిష్కరించడం. భారత్‌ ఇప్పటికే గడువు లోపు ఛాంపియన్స్‌ ట్రోఫీకి జట్టును ప్రకటించకపోవడం ద్వారా ఐసీసీ ప్రయత్నాల్ని అడ్డుకునే ఎత్తుగడ వేసింది. కానీ ఐసీసీ పట్టించుకోలేదు. మరి టోర్నీకి జట్టునే పంపకపోవడం ద్వారా భారత్‌ తన నిరసనను తెలియజేస్తుందా ...భారత్‌ ఆడలేదంటే ఛాంపియన్స్‌ ట్రోఫీనే కళతప్పడం, ఆదాయంలో భారీగా గండిపడటం ఖాయం.