ఇరాక్‌లోని మొసూల్ నగరంలో గల అతి పురాతన చారిత్రక కట్టడం అల్ నూరీ మసీదును ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బుధవారం పేల్చివేశారు. మొసూల్ నగరాన్ని అధీనంలోకి తెచ్చుకునేందుకు గతకొన్ని నెలలుగా ఇస్లామిక్ ఉగ్రవాదులు, ఇరాక్ భద్రతా బలగాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఐసిస్ ఉగ్రవాదులు మసీదును పేల్చివేసినట్లు ఇరాక్ బలగాలు పేర్కొంటున్నాయి. అయితే మసీదును తాము పేల్చలేదని ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. అమెరికా సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లోనే అల్ నూరీ మసీదు ధ్వంసమైందని ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన అమఖ్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. కాగా.. ఐసిస్ ఆరోపణలను అమెరికా తీవ్రంగా ఖండించింది. ‘అల్ నూరీ మసీదు ధ్వంసమైంది. అయితే అది సంకీర్ణ దళాల వైమానిక దాడుల వల్ల మాత్రం కాదు. అసలు మేం ఆ ప్రాంతంలో బుధవారం దాడులు చేయలేదు’ అని సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి కల్నల్ ర్యాన్ దిల్లాన్ వెల్లడించారు.
అతి పురాతన, ఎంతో ప్రాచుర్యం కలిగిన దేశ సంపదను ఇరాక్ కోల్పోయింది. 800 ఏళ్ల కిత్రం నూర్ అల్ దిన్ మహ్మద్ జంగీ ఆదేశాల మేరకు ఈ మసీదును నిర్మించారు. అప్పటి నుంచి ఈ మసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ మసీదులోని అతి ఎత్తైన స్తంభం లెర్నింగ్ మినరేట్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది.