క్రికెట్లో ఇప్పటికీ పసికూనగా పేరున్న బంగ్లాదేశ్ మరో సంచలనం సృష్టించింది. తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో కంగారూలను చిత్తు చేసింది బంగ్లాదేశ్. ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ మ్యాచ్‌లో పది వికెట్లు తీసి బంగ్లా గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్ 5 వికెట్లు తీసిన షకీబ్.. ఆసీస్‌కు షాకిచ్చాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 260 రన్స్ చేయగా.. ఆస్ట్రేలియా 217 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో 221 రన్స్ చేసిన బంగ్లా.. ఆసీస్‌కు 265 రన్స్ టార్గెట్ ఇచ్చింది.
అయితే చేజింగ్‌లో ఆసీస్ తడబడింది. ఓపెనర్ వార్నర్ (112) మెరుపు సెంచరీ చేసినా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో 244 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌటైంది. చివరి 7 వికెట్లను కేవలం 73 పరుగుల తేడాలో కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 2 వికెట్లకు 109 రన్స్‌తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. గెలిచేలా కనిపించినా చివరికి ఓటమి తప్పలేదు.
టెస్ట్ క్రికెట్లో బంగ్లాకిది కేవలం పదో విజయం. కంగారూలపై ఆ టీమ్కిదే తొలి విజయం. దీంతో టెస్ట్ క్రికెట్లో రెండు రోజుల్లో రెండు సంచలన విజయాలు నమోదయ్యాయి. నిన్న ఇంగ్లండ్‌పై 322 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ అనూహ్యంగా ఛేదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కంగారూలకే బంగ్లా చెక్ పెట్టి టెస్టుల్లోని మజాను అభిమానులకు అందించింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో బంగ్లా 1-0 ఆధిక్యం సంపాదించింది.