//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాబు పవన్ ఒకే గదిలో ....ఏమి మాట్లాడుకున్నారంటే...!

Category : politics

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సమయం దొరికినప్పుడల్లా ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అగ్ర నేతలు పావుగంటపాటు సమావేశం కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వారిద్దరి కలిసి ఏం మాట్లాడుకున్నారు అన్నదానిపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.

శుక్రవారం విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై రెయిన్ ట్రీ పార్క్ సమీపంలోని లింగమనేని ఎస్టేట్స్‌లో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు-పవన్‌లను గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరికి పిలిచి ఓ గదిలోకి తీసుకెళ్లారు.

అక్కడ వారు ముగ్గురూ పావుగంట పాటు సమావేశమై వివిధ అంశాల గురించి ప్రస్తావించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, అక్కడ గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు కాబట్టి రాజకీయాల గురించి వారు ప్రస్తావించి ఉండకపోవచ్చని అంటున్నారు. ఆధ్యాత్మిక అంశాలపై చంద్రబాబు-పవన్ చర్చించి ఉండొచ్చని చెబుతున్నారు. టీడీపీ వర్గాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి.

విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి చంద్రబాబు కంటే ముందే పవన్ తన సతీమణితో కలిసి చేరుకున్నారు. గర్భాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగినప్పుడు పక్కపక్కనే నిల్చున్న చంద్రబాబు-పవన్ ఒకరి నొకరు పలకరించుకున్నారు. తొలుత పవన్ ‘సార్ బాగున్నారా?’ అని పలకరించారు. స్పందించిన సీఎం.. ‘బాగున్నాను.. మీరెలా ఉన్నారు?’ అని ప్రతిస్పందించారు. మొత్తానికి ఉప్పు-నిప్పులా ఉండే నేతలు ఇద్దరూ ఒకే గదిలో 15 నిమిషాలు కలిసి కూర్చుని మాట్లాడడం చర్చనీయాంశమైంది.