లండన్: విరామ సమయంలో ఆటగాళ్లకు సహచరులు కూల్‌డ్రింక్స్ తీసుకెళ్తుంటారు . ఈ విధానం మనం ఎక్కడైనా చూసేదే. కానీ, తాజాగా క్రికెట్ మైదానంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే... ఆటగాళ్లకు ఆటోలో డ్రింక్స్ తీసుకెళ్లడం.
ఇంగ్లాండ్‌లో ఓ లోకల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు భారత్ అభిమానులు ఆటోలో ఆటగాళ్లకు కూల్‌డ్రింక్స్ తీసుకెళ్లి ఇచ్చేందుకు ముందుగానే అనుమతి తీసుకున్నారు. మ్యాచ్ ఆసక్తిగా సాగుతోన్న సమయంలో బ్రేక్ వచ్చింది. ఇంతలో ఒక ఆటో మైదానంలోకి దూసుకువచ్చింది. గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న వారికి ముందుగా ఏం జరుగుతుందో తెలియలేదు. ఆ తర్వాత ఆటోలో వచ్చిన వారు ఆటగాళ్లకు డ్రింక్స్ అందజేయడం ఆ తర్వాత తిరిగి వెనక్కి రావడంతో విషయం అర్థమైంది. ఇంతకీ ఆటోలో ఆటగాళ్లకు డ్రింక్స్ అందించింది ఎవరో తెలుసా.. భారత అభిమానులు. ఔను.. ఇంగ్లాండ్‌లో భారత్ ఆర్మీ అని ఒక బృందం ఉంది. మొన్న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టుకు భారత్ ఆర్మీ బృందం హాజరై కోహ్లీ సేనను ప్రోత్సహించింది.
ఆటోలో ఆటగాళ్లకు డ్రింక్స్ అందించిన వీడియోను భారత్ ఆర్మీ బృందం తన సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.