ఒక ఆటగాడు ఇన్నింగ్స్‌లో 40 సిక్స్‌లు కొట్టేయడాన్ని వూహించగలమా! 35 ఓవర్ల మ్యాచ్‌లో ఒక జట్టు 354 పరుగులు చేస్తే..అందులో ఒక్క బ్యాట్స్‌మెనే ట్రిపుల్ సెంచరీ చేస్తే నమ్మగలమా? కానీ ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ డన్స్టన్ ఇవన్నీ చేసేశాడు. అబ్బ.. ఏం కొట్టాడండి.. రికార్డులను తిరగరాస్తూ.. అందరిని అబ్బురపరస్తూ..! పశ్చిమ అగస్టా జట్టు తరఫున ఆడుతూ సెంట్రల్ స్టిర్లింగ్‌పై శివమెత్తినట్లు ఆడిన జోష్.. సిక్స్‌ల వర్షం కురిపించాడు. ఆ జట్టు స్కోరు 10/1తో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అతను.. బంతిని స్టాండ్స్‌లోకి కొట్టడమే పనిగా చెలరేగాడు. అతని జట్టులోని ఐదుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు కూడా చేయకపోగా.. జోష్ (305) ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. ఏ స్థాయి క్రికెట్లో చూసినా జోష్ది సంచలన ప్రదర్శనే. అగస్టా జట్టు మొత్తం స్కోరు (354)లో జోష్ భాగస్వామ్యం 86.72 శాతం. ఒక జట్టు చేసిన స్కోరులో ఎక్కువ భాగం పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా జోష్ కొత్త రికార్డు నెలకొల్పాడు. 33 ఏళ్ల క్రితం బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ నెలకొల్పిన రికార్డును అతను బద్దలు కొట్టాడు. 1984లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో వెస్టిండీస్ 272 పరుగులు చేయగా.. అందులో రిచర్డ్స్ (69.49 శాతం) ఒక్కడే 189 పరుగులు సాధించాడు. అంతేకాదు జోష్.. ట్రిపుల్ సెంచరీ సాధించడం కూడా అరుదైన ఘనతే. వన్డేల్లో సచిన్ తెందుల్కర్, రోహిత్‌శర్మ, క్రిస్ గేల్, గప్తిల్ మాత్రమే డబుల్ సెంచరీలు చేశారు. వీళ్లలో రోహిత్ ఒక్కడే రెండుసార్లు ద్విశతకం బాదాడు.