2019 వన్డే ప్రపంచకప్ కి ఆసియా జట్ల బలాబలాలేంటో చూసేందుకు, జట్ల కూర్పు విషయంలో ప్రయోగాలు చేసేందుకు వేదికగా నిలవబోతోంది ఆసియా కప్. 34 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ టోర్నీ.. ఆసియా మహా జట్లు భారత్, పాకిస్థాన్, శ్రీలంకలకు ఎప్పుడూ ప్రతిష్టాత్మకమే. ఈ మూడు జట్ల మధ్య ఎన్నో అద్భుత పోరాటాలు చూశారు అభిమానులు ఈ టోర్నీలో.
విరాట్ కోహ్లి గైర్హాజరీ నేపథ్యంలో రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ టోర్నీలో బరిలోకి దిగుతోంది. కోహ్లి లేకపోవడం లోటే అయినా.. ఇప్పటికీ టోర్నీలో భారతే ఫేవరెట్. ఐతే కప్పు గెలవడం అంత సులువేమీ కాదు. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ప్రతిభావంతులతో నిండి ఉన్నాయి. మిస్టరీ స్పిన్నర్లు, విధ్వంసక బ్యాట్స్‌మెన్‌తో ప్రమాదకరంగా కనిపిస్తున్న అఫ్గాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం.
ఈసారి కొత్తగా..: ఆసియా కప్ ఈసారి కొత్త ఫార్మాట్లోకి మారుతోంది. మామూలుగా టోర్నీలో పోటీ పడే ప్రతి జట్టూ.. గ్రూప్ దశలో మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్లో తలపడతాయి. ఐతే ఈసారి అలా కాకుండా టోర్నీలో తలపడుతున్న ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్ మూడు జట్లుంటాయి. అవి పరస్పరం తలపడతాయి. రెండు గ్రూప్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4 దశకు అర్హత సాధిస్తాయి. అక్కడ ప్రతి జట్టూ మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు వెళ్తాయి.ఆసియా కప్ సందర్భంగా భారత బ్యాట్స్‌మెన్‌కు సరైన ప్రాక్టీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఐదుగురు ఇండియా-ఎ బౌలర్లను దుబాయ్‌కి పంపించింది.
# AsiaCup2018schedule #Sportsnews #sportsupdates #latestsportsnews