//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏప్రిల్ 1 డెడ్ లైన్.. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి

Category : state

రవాణా శాఖ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల బిగింపుకు డెడ్ లైన్ పెట్టింది.ఏప్రిల్ 1 నుంచి హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లు బిగించిన వాహనాలను మాత్రమే షోరూమ్ నుంచి బయటకు విడుదల చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ప్రతి వాహనానికి సంబంధించిన సాంకేతిక వివరాలతోపాటు, వాహన యజమానుల వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకునేలా బయోమెట్రిక్‌ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని షోరూంలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్ల విషయంలోనూ ఇదే విధానం పాటించనున్నారు. 2012లోనే హైసెక్యూరిటీ ప్లేట్ల బిగింపును ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ చాలామంది వీటి నాణ్యత విషయంలో, ఇతర కారణాలతో బిగించుకోవటంలేదు. అందుకని ఇక నుంచి వాహనం అమ్మకం జరిగి డెలివరి ఇచ్చేటప్పుడే వీటిని బిగించేలా రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి షోరూంల్లో రిజిస్ట్రేషనయ్యే బైకులు, కార్లు, తదితర నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్లు అక్కడే బిగించి బయటకు పంపుతారు.

వాహనాల వాడకం విషయంలో పలువురు అవకతవకలకు పాల్పడటం, నేర సంఘటనలు జరిగినప్పుడు ఒకే నంబర్‌పై అనేక వాహనాలు నడపటం, పేలుళ్లకు చోరీ చేసిన వాహనాలు వినియోగించడం తదితర విషయాలు వెలుగుచూస్తున్నందున ప్రభుత్వం హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ విధానం ప్రవేశ పెట్టింది. 2015, డిసెంబర్‌ నాటికి పాత, కొత్త వాహనాలకు వీటిని తప్పనిసరి చేసింది. అయితే, అప్పటి నుంచి కేవలం కొత్త వాహనాలకు మాత్రమే వీటిని బిగించుకుంటున్నారు. పాత వాహనాలు పాత నెంబర్ ప్లేట్ల తోనే తిరుగుతున్నాయి. ఈ నంబర్‌ ప్లేట్లకు బైక్‌కు రూ.245, ఆటోకు రూ.400, కారుకు రూ.619 వసూలు చేస్తున్నారు. షోరూంలో వాహనం కొనుగోలు సమయంలోనే ఈ రుసుము చెల్లించాలి. నంబర్‌ప్లేట్‌ సిద్ధం కాగానే వాహనదారుడికి ఎస్‌ఎమ్‌ఎస్‌ వస్తుంది. అపుడు వెళ్లి దాన్ని బిగించుకోవాలి.

హైసెక్యూరిటీ నెంబరు ప్లేట్లు అమలులో అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది వాస్తవానికి ఈ హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లు చాలా పలుచగా నాసిరకంగా ఉన్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలు సైతం వీటిని వంచడం లేదా పీకేయడం సులువుగా చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇస్తున్న ఈ నెంబరు ప్లేట్లు అమర్చాక 10 నెలలు కూడా ఉండటం లేదని వాహనదారులు అంటున్నారు. చాలా వరకు హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్లు ఆర్టీఏ కార్యాలయాల్లో మూలకు పడుతున్నాయి. ట్రాఫిక్‌ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు నంబర్‌ప్లేట్లను వంచడం, విరగ్గొట్టడం చేస్తున్నారు. ఈ నంబర్‌ ప్లేట్‌ రెండోసారి బిగించుకోవాలంటే ఎఫ్‌ఐఆర్‌ తప్పనిసరి. ఈ తతంగమంతా ఎందుకులే అని వాహనదారులు వారే కొత్త ప్లేట్‌ వేయించుకుంటున్నారు. హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌ లేకుండా తిరిగినప్పుడు ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు చలానా రాస్తారు. అయినా వాహనదారులు చలానాలు కడుతున్నారు తప్ప వీటిని బిగించుకోవడంపై ఆసక్తి చూపడం లేదని సమాచారం.