ప్రస్తుతం మార్కెట్లో హల్చల్ చేస్తున్న గూగుల్ హోం.. అమెజాన్ ఎఖో స్టార్ట్ స్పీకర్లకు పోటీగా యాపిల్ రంగంలోకి దిగుతోంది. ఐఫోన్ వినియోగదారులకు సుపరిచితమైన ‘సిరి’ యాప్‌తో పనిచేసే స్మార్ట్ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యాపిల్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఐఫోన్.. ఐప్యాడ్ తదితర యాపిల్ గ్యాడ్జెట్లు ఎంత నాణ్యంగా ఉంటాయో.. సిరి స్పీకర్ కూడా అదే స్థాయిలో ఉంటుందని సంస్థ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాంకేతికతతో పనిచేసే స్మార్ట్ స్పీకర్ ‘ఎఖో’ను తొలుత అమెజాన్ విడుదల చేసింది. ఆ తర్వాత గతేడాది గూగుల్ హోం స్పీకర్లు వచ్చాయి. స్మార్ట్ గృహాలు.. కార్లలో ఈ స్పీకర్ల వాడకం బాగా పెరుగుతున్న నేపథ్యంలో యాపిల్ కూడా ‘సిరి స్పీకర్ల’ను తీసుకొస్తోందట.
గూగుల్.. అమెజాన్ స్పీకర్లతో పోల్చితే సిరి స్పీకర్లలో పెద్ద తేడా లేకపోయినా.. ధర మాత్రం ఎక్కువగానే ఉంటుందని సమాచారం. వచ్చే నెలలో జరిగే యాపిల్ డెవలపర్ల వార్షిక సదస్సులో ఈ స్పీకర్లను విడుదల చేయనున్నట్లు తెలిసింది.