అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా వెంకట రాఘవాపురం గ్రామంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు 1923 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో జన్మించాడు.అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు. ఆమెపేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు. అన్నపూర్ణ 28.12.2011 న మృతి చెందారు.
అక్కినేని నాగేశ్వరరావు ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. వరి చేలలోనుండి, నాటకరంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తి. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు.
ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య ద్వారా విజయవాడ రైల్వే స్టేషన్లో విధివశాత్తు గుర్తించబడ్డాడు. ధర్మపత్ని సినిమాతో సినీజీవితం ప్రారంభించాడు. అప్పటినుండి రకరకాల తెలుగు, తమిళ సినిమాలలో 75సంవత్సరాల పైగా నటించాడు. ఎన్.టి.ఆర్తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు.మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినిరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్‌తో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు.
ANR ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి నటించిన సినిమాలు 256, ఆయన నటించిన ఆఖరి సినిమా “మనం”.1953 లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నటసామ్రాట్ అక్కినేని ప్రస్థానం అద్భుతం. 1966 లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత అక్కినేని కే దక్కింది.
1981 లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971 లో వచ్చిన దసరాబుల్లోడు. తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. చిత్ర పరిశ్రమని హైదరాబాదుకు రావడానికి ఎంతో కృషి చేశారు. పర భాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహా నటుడు, నిర్మాత.
1940 లో విడుదలైన "ధర్మపత్ని" ఆయన నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కథా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం "శ్రీ సీతారామ జననం" (1944). ఆకర్షించే రాజకుమారుడినుండి విరక్తిచెంది మందుకుబానిసైన ప్రేమికుడి వరకు, ధీరుడైన సైనికుడినుండి పవిత్రుడైన ఋషి వరకు, కళాశాల విద్యార్థినుండి సమర్ధుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రలలో నటించాడు. పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు ( మాయాబజార్ ), విష్ణువు (చెంచులక్ష్మి), నారదుడు (భూకైలాస్), అర్జునుడు (శ్రీకృష్ణార్జున యుద్ధం )లో రాణించాడు.
గ్రామీణ ప్రాంతాలకు అద్దంపట్టే సినిమాలైన బాలరాజు, రోజులు మారాయి, మరియు నమ్మినబంటులో నటించి, తెలుగు నటసామ్రాట్‌గా పేరుపొందాడు. మిస్సమ్మ, చక్రపాణి మరియు ప్రేమించుచూడు లాంటి హాస్యరసప్రధాన చిత్రాలలో అందరి మన్ననలందుకున్నాడు. లైలామజ్ను, అనార్కలి(1955), బాటసారి, ప్రేమనగర్, ప్రేమాభిషేకం,మరియు మేఘసందేశంలో నటన ద్వారా తెలుగుచిత్రరంగానికి విషాదరారాజుగా పేరుపొందాడు.
దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం హైదరాబాదులో 533 రోజులు ప్రదర్శించబడి తెలుగుసినిమాలో రికార్డు నమోదు చేసింది.ఇది అంతరాయం లేకుండా 365 రోజులు నడచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది.
ఎన్నో ఫిలింఫేర్, నంది, కళాసాగర్, వంశీ అవార్డులు కూడా ఆయన అందుకున్నారు.అక్కినేని నాగేశ్వరరావు యొక్క చిత్రపటము విశాఖపట్నం లోని ఒక దుకాణములో గాజుపై చిత్రించబడినది
పురస్కారాలు, బిరుదులు :
విశిష్ట వ్యక్తి అవార్డు - 10.03.1988 - సాహితి సాంస్కృతిక సంస్థ, తెనాలి.
రాజ్ కపూర్ స్మారక అవార్డు - 10.06.1989 - కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు.
రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు - 10.03.1980 - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.
పద్మవిభూషణ్(భారత ప్రభుత్వం)
పద్మ భూషణ్ - 1988 - భారత ప్రభుత్వం.
కాళిదాస్ సమ్మాన్ మధ్య ప్రదేశ్.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు - 07.04.1991 - ఆర్. వెంకట్రామన్, భారత రాష్ట్రపతి, కొత్త ఢిల్లీ.
లైఫ్ టెమ్ అఛీవ్ మెంట్ అవార్డు - 21.10.1994 - కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్స్ బర్గ్.
అన్నా అవార్డు - 24.11.1995 - జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, చెన్నై.
పద్మశ్రీ - 1968 భారత ప్రభుత్వం.
యన్టీయార్ జాతీయ పురస్కారము (ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం),
డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డ్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు,
నటసామ్రాట్,
కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్),
అక్కినేని నాగేశ్వరరావు 91 సంవత్సరాల వయసులో 2014, జనవరి 22 న మరణించారు. అర్థరాత్రి దాటాక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో కుటుంబసభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రి తీసుకువెళ్ళారు. పదినిమిషాలకే డా.సోమరాజు వైద్యుల బృందంతో పరిశీలించగా మృతిచెందారని నిర్ధారణ అయింది.