మరో భారతీయ అమెరికన్‌కు అంతరిక్షంలోకి దూసుకుపోయే అవకాశం లభించింది. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రాజాచారి వారి వారసత్వాన్ని కొనసాగించబోతున్నారు. అమెరికా వైమానికదళంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేస్తున్న రాజాచారి నాసా వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికయ్యారు.
భవిష్యత్‌లో నాసా చేపట్టే సుదీర్ఘ అంతరిక్షయాత్రల కోసం ఎంపిక చేసిన 12 మందిలో ఆయన ఒకరు. 18,300 దరఖాస్తుల్లో నుంచి వీరిని ఎంపిక చేశారు. 39 సంవత్సరాల చారి అయోవా రాష్ట్రానికి చెందినవారు. ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ అందుకున్న తర్వాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదివారు. అమెరికా నౌకాదళ టెస్ట్పైలట్ స్కూల్లో శిక్షణ అనంతరం ఆయన వైమానిక దళంలో చేరారు.
ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో 461 ఫ్లయిట్ టెస్ట్ స్కాడ్రన్ కమాండర్‌గా, ఎఫ్-35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఇరాక్ ఆపరేషన్స్‌లో పాల్గొన్న అనుభవం ఆయనకు ఉన్నది.
హ్యూస్టన్‌లో జరిగిన వ్యోమగామి అభ్యర్థుల పరిచయ కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షుడు మైకె పెన్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెన్స్ మాట్లాడుతూ అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిభ, సాహసం అంతరిక్ష అన్వేషణలో దేశాన్ని సమున్నత శిఖరాలకు చేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.