//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షాక్ లో ఏపీ ... వరుస దాడులతో వణికిపోతున్న ఏపీ

Category : state

ఒకపక్క జగన్ పై దాడి ఘటనలో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటే మరోపక్క ఐటీ దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. మూడు రాష్ట్రాలలో 100 ప్రాంతాలలో 200 మందికిపైగా ఐటీ అధికారులు దాడులకు దిగారు. పలు సంస్థలు, కంపెనీలు, ఫ్యాక్టరీలపై ఏకకాలంలో విరుచుకుపడ్డారు.

ఏపీలో ముందుగా ఊహించినట్టే భారీ సోదాలకు తెరలేపారు ఐటీ అధికారులు. ఈ విడతలో మిడతలదండులా ఐటీ అధికారుల బృందాలు దండెత్తాయి.వివిధ రాష్ట్రాల నుంచి భారీఎత్తున ఆదాయ పన్ను అధికారులు విశాఖకు చేరుకొన్నారు. స్థానిక పోలీసులు, అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండానే భారీ తనిఖీలను ప్రారంభించారు. ఒక్క విశాఖలోనే 50 బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళంలో తెల్లవారుజామునే పలువురు వ్యాపారులు, రాజకీయ నేతలకు చెందిన కంపెనీలు, సంస్థల తలుపులను ఐటీ అధికారుల తట్టారు.

రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు చేపడుతున్న కాంట్రాక్టర్ల గృహాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. పలు మినరల్‌ కంపెనీలు, వాటికి సంబంధించిన ఆడిటర్ల ఆఫీసుల్లో కూడా తనిఖీలు చేశారు. దువ్వాడ ఆర్థిక మండలి వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సహాయంతో ఎట్టకేలకు ఐటీ అధికారులు లోపలకు వెళ్లగలిగారు. ఎంవీపీ కాలనీలోని ఈ కంపెనీ చార్టెడ్‌ అకౌంటెంట్‌ నివాసంలోనూ సోదాలు జరిగాయి. నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో బీచ్‌ మినరల్స్‌ వ్యాపారం చేస్తున్న ఓ ఎగుమతి సంస్థలో ఇంకో బృందం తనిఖీలు జరిపింది. మరికొన్ని ఐటీ బృందాలు రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులను చేపడుతున్న రెండు నిర్మాణ సంస్థల కార్యాలయాలకు చేరుకొన్నాయి. ఓ నిర్మాణ కాంట్రాక్టు సంస్థకు చెందిన హైదరాబాద్‌ కార్యాలయంలోనూ తనిఖీలు జరిగాయి. అక్కడ ఉదయం మొదలైన సోదాలు అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగాయి. ఇటు శ్రీకాకుళం జిల్లాలోనూ ఐటీ దాడులు జరిగాయి. సముద్రపు ఇసుకను తీసి శుద్ధిచేసి విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలో ఒక బృందం సోదాలు జరుపుతుండగానే, మరో టీమ్‌ రణస్థలం మండలంలోని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నడుకుదిటి ఈశ్వరరావు నివాసంలో సోదాలు జరిపింది. శ్రీకాకుళం,విశాఖ జిల్లాల్లోని కీలక వ్యక్తులపై జరిపిన ఐటీ దాడులు ఏపీలో చర్చ కు దారి తీశాయి.

ఒక పక్క జగన్ పై భౌతిక దాడి,మరో పక్క ఐటీ దాడులతో రాష్ట్రంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని రీతిలో జరుగుతున్న ఈ దాడుల మర్మం ఏంటో కేంద్రానికే ఎరుక అంటున్నారు ఏపీ ప్రజలు.

Related News