ఉగ్రవాదిపై నిఘా వేయమంటే ఓ ఎఫ్‌బీఐ ఏజెంట్ ఏకంగా అతడిని పెండ్లిచేసుకున్నది. తప్పు తెలుసుకుని వెనుకకు వచ్చిన ఆమెకు రెండేండ్ల జైలుశిక్ష పడింది. సీఎన్ఎన్ చానెల్ ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది. ఐఎస్ ఉగ్రవాది డెనిస్ కస్పర్ట్ అలియాస్ అబూతాలా అల్-అల్మానీకి ఏదోరకంగా దగ్గరై అతని గురించి సమాచారం సేకరించాలంటూ అమెరికా నిఘా సంస్థ (ఎఫ్‌బీఐ) డేనియెలా గ్రీన్ అనే ఏజెంట్‌కు బాధ్యత అప్పగించింది. స్కైప్ వంటి ఆన్లైన్ టూల్స్ ద్వారా ఆమె అల్మానీతో పరిచయం పెంచుకున్నది. ఆ తర్వాత ఎఫ్‌బీఐకి చెప్పకుండా సిరియా వెళ్ల్లిపోయి ఏకంగా పెండ్లి చేసుకున్నది. జర్మనీకి చెందిన అల్మానీ ఇస్లాం మతంలోకి మారిపోయి సిరియా వెళ్లాడు. ఐఎస్‌లో చేరి జర్మన్లను రిక్రూట్ చేసుకోవడం పనిగా పెట్టుకున్నాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను హెచ్చరిస్తూ ప్రసంగించే వీడియో ద్వారా అల్మానీ ప్రపంచానికి తెలిశాడు. అతడిని పెండ్లి చేసుకున్న గ్రీన్ ఎఫ్‌బీఐ దర్యాప్తు గురించి అతనికి చెప్పేసింది. కొన్నాళ్లు సిరియాలో అతనితో గడిపిన తర్వాత తాను తప్పు చేశానని గ్రహించి వెనుకకు వచ్చేసింది. ఎఫ్‌బీఐ ప్రతిష్ఠను దెబ్బతీసే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. కోర్టు ఆమెకు రెండేండ్లు జైలుశిక్ష విధించింది.