ఒక్క జియో ఫోన్ లాంచ్‌తో ఏకంగా మూడు మేజర్ మార్కెట్లకు రిలయెన్స్ అధినేత ముకేశ్ అంబానీ దడ పుట్టించారు. ఈ ఫోన్ వల్ల టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, కేబుల్, డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్స్, ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు పెద్ద దెబ్బ పడనుంది. అంబానీ ఈ ప్రకటన చేయగానే ఈ మూడు రంగాల షేర్ల ధరలు పతనమవడంతోపాటు రిలయెన్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి.
ఫ్రీగా జియో ఫోన్ అన్న ప్రకటన ద్వారా ఇండియాలో ఉన్న 50 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించారు అంబానీ. దీనివల్ల స్మార్ట్ఫోన్లను చీప్‌గా ఇస్తున్నామని భావిస్తున్న మైక్రోమాక్స్, లావా, కార్బన్, ఒప్పొ, షియోమీలాంటి కంపెనీలకు కష్టకాలమే అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ఇక మొబైల్ టు టీవీ కేబుల్ అంటూ కొత్త ప్రకటన చేసిన అంబానీ అటు సెట్ టాప్ బాక్సులతో పనేంటన్న ఆలోచనను రేకెత్తించారు. మొబైలే సెట్‌టాప్ బాక్స్‌గా పనిచేయనుంది. జియో యాప్‌లో ఎలాగూ చాలా వరకు ఇండియన్ ఛానల్స్ వస్తున్నాయి. దీనివల్ల సాంప్రదాయ కేబుల్, డీటీహెచ్ కంపెనీలకు ఎంతో కొంత నష్టం తప్పదు.
ఇక హ్యాండ్సెట్ కోసం మూడేళ్ల డిపాజిట్ అన్నది కూడా వ్యూహాత్మక నిర్ణయమే. తన కస్టమర్ బేస్‌ను వేరే ఆపరేటర్ దగ్గరకి వెళ్లకుండా ఉంచుకోవడంతో పాటు అతి తక్కువ రేటులో అన్లిమిటెడ్ డేటా ఇవ్వడం ఇందులో భాగమేనని భావిస్తున్నారు. దీనివల్ల ప్రత్యర్థులు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలు తీవ్రంగా నష్టోనున్నాయి.
అంబానీ ప్రకటన తర్వాత ఎయిర్టెల్ షేర్లు 4 శాతం, ఐడియా షేర్లు 7 శాతం నష్టపోయాయి. అటు డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్స్‌లో డిష్ టీవీ 8.5 శాతం, సన్ టీవీ 4.2 శాతం, డెన్ నెట్వర్క్స్ 2.46 శాతం, హాత్వే కేబుల్ 5 శాతం పతనమయ్యాయి.