అమెరికాలో చాలా ఏళ్ల అనంతరం ఆగష్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణ దృశ్యాలు కనువిందు చేయనున్నాయి. ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు పలు సంస్థలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా ఈ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు భారీ బెలూన్లను ఆకాశంలోకి పంపనుంది.
నాసా భాగస్వామ్యంతో మోంటనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ఈ బెలూన్ల ప్రాజెక్టులో పాలుపంచుకుంటోంది. సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో దాదాపు 80 వేల అడుగుల ఎత్తువరకూ ఈ బెలూన్లను పంపనున్నారు. బెల్లూన్లకు అమర్చిన కెమెరాల ద్వారా గ్రహణ దృశ్యాలను చిత్రీకరించి లైవ్‌స్ట్రీమింగ్ చేయనున్నారు. 9 అడుగుల పొడవుండే ఈ భారీ బెలూన్లలో హీలియం వాయువును నింపనున్నారు.
అత్యంత నాణ్యతతో కూడిన వీడియోలను, చిత్రాలను అందించే కెమెరాలను ఇందులో పొందుపరుస్తున్నారు. అమెరికాలోని దాదాపు 50 ప్రాంతాల నుంచి వీటిని గాలిలోకి వదలనున్నారు. బెలూన్ల నుంచి అందే దృశ్యాలను లైవ్‌స్ట్రీమింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ దృశ్యాల ఆధారంగా పరిశోధకులు సూర్యుని కాంతి వలయం, చంద్ర కక్ష్యపై పరిశోధనలు చేపట్టనున్నారు. 1979 తర్వాత అమెరికాలో ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే.