//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హైదరాబాద్‌ కి హైటెక్‌ సిటీ, ఏపీ కి మైటెక్‌ పార్క్‌...

Category : business

రాష్ట్ర యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతిలోనే ఐటీ ఉద్యోగాలను పొందేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది.

దానికి నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరి వద్ద ఉన్న ఎన్ ఆర్ టి టెక్ పార్కులో ఈరోజు 13 ఐటీ సంస్థలు కొలువయ్యాయి. మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ సంస్థలలో సిగ్నం డిజిటల్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, చారువికెంట్ ఐటీఈఎస్ ప్రైవేటు లిమిటెడ్, అద్వైత్ అల్గారిథం, స్క్రిప్ట్ బీస్ ఐటీ లిమిటెడ్, స్వరా సాఫ్ట్, సన్ స్వెట్, పిక్సీ, సువిజ్, డీఎఫ్ఐ స్విస్,ఆస్టోనా, క్రేజీ టూన్జ్ యానిమేషన్ స్టూడియోస్, మహాత్రు మీడియా సొల్యూషన్స్, సాత్వికా డిజిటల్ నెట్ వర్క్స్ సంస్థలు ఉన్నాయి.

ఇవి కాకుండా మంగళగిరి ఆటోనగర్‌ ఐటీ పార్కులో మరో మూడు సంస్థలను ఈరోజే లోకేష్ ప్రారంభించారు. వీటిల్లో హెల్త్ కేర్ ఐటీ సంస్థ మేక్ మై క్లినిక్ ఇండియా, ఐటీ ఆధారిత సేవలను అందించే ఎక్సెల్లర్ ఇన్ఫో సర్వీసెస్, బీవీజీ ఇండియా లిమిటెడ్ పేరుతో మరో ఐటీ ఆధారిత సంస్థలు ఉన్నాయి.

మొత్తంగా ఈ 16 సంస్థల ఏర్పాటుతో తక్షణం 600 మందికి ఉపాధి లభిస్తుండగా... రానున్న ఏడాది కాలంలో మరో 1600 మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. ఈరోజు ప్రారంభించిన కంపెనీలతో కలిసి రాష్ట్రంలో 54 ఐటీ, ఐటీ సంబంధిత కంపెనీలు ఏర్పాటయ్యాయి.

మంగళగిరి లో ఐటి కంపెనీల ప్రారంభోత్సవ వేడుకలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. '2014 లో రాష్ట్ర విభజన జరిగింది. కష్టపడి నిర్మించుకున్న సైబరాబాద్ తెలంగాణ కు వెళ్లిపోయింది.రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితిలో పరిపాలన ప్రారంభించాం.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారు వారికి నా కృతజ్ఞతలు.

ఒక్కప్పుడు రాళ్లు, రప్పల మధ్య సైబరాబాద్ ఏర్పాటు అయ్యింది...ఒక్క సైబర్ టవర్ వలన ఇప్పుడు హైదరాబాద్ లో 6 లక్షల ఐటి ఉద్యోగాలు వచ్చాయి.ఎంతో కష్ట పడి నిర్మించుకున్న రాజధాని,సైబరాబాద్ పోయింది అన్నబాధ...అయితే నవ్యాంధ్ర అంతకు మించి అభివృద్ధి సాధించాలి అన్న కసితో పనిచేస్తున్నాం. నేను మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత 2019 లోపు లక్ష ఐటి ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నా'...లోకేష్ చెప్పారు.

గత 9 నెలల్లోనే ఐటి రంగంలో 24 వేల ఉద్యోగాలు కల్పించామని...ఒక్క మంగళగిరి ఐటి క్లస్టర్ లో 10 వేల ఉద్యోగాలు రాబోతున్నాయని లోకేష్ చెప్పారు. ఇప్పటికే మంగళగిరి క్లస్టర్ లో 25 కంపెనీలు,2 వేల ఉద్యోగాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రా వ్యాలీ ఏర్పాటు చెయ్యాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేసారు. ఒక్క సైబరాబాద్ కోల్పోతే...నాలుగు సైబరాబాద్ లు నిర్మించాలి అని లక్ష్యంగా పెట్టకున్నట్లు లోకేష్ వివరించారు.

విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, అనంతపురం లో నాలుగు ఐటి క్లస్టర్లు రాబోతున్నాయి. ప్రతి 10లో 2 ఫోన్లు మనవే... మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఇక్కడ పెద్దగా అభివృద్ధి చెందలేదు. అప్పుడు మన రాష్ట్రంలో ఒక్క ఫోన్ కూడా తయారు కాలేదు...కానీ ఇప్పుడు దేశంలో తయారు అవుతున్న ప్రతి 10 ఫోన్లలో 2 మన రాష్ట్రంలో తయారు అవుతున్నాయని లోకేష్ ఈ సందర్భంగా లోకేష్ చెప్పారు.

ఐటి కంపెనీలను ఆకర్షించడానికి డిటిపి పాలసీ తీసుకొచ్చాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడానికి ఐఐటి పాలసీ తీసుకొచ్చాం. ఐటి రంగం పూర్తి స్థాయి లో అభివృద్ధి చెందాలంటే కేవలం పెద్ద కంపెనీలు మాత్రమే కాదు చిన్న ,మధ్య తరగతి కంపెనీలు కూడా రావాలని లోకేష్ చెప్పారు.

మీ రాష్ట్రానికి మేము ఎందుకు రావాలి?..మీ రాష్ట్రంలో ఏమి ఉంది అని కొంత మంది ఐటి కంపెనీల ప్రతినిధులు తనను అడిగారని మంత్రి లోకేష్ చెప్పారు. వారికి తానొక్కటే చెప్పానని...మా రాష్ట్రంలో అద్భుతమైన యువతి, యువకులు ఉన్నారు. అందుకే మా రాష్ట్రానికి రండి అని వారిని కోరానని తెలిపారు. స్టార్ట్ అప్ కంపెనీలకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తున్నామని, విద్యార్థులకు పెద్ద కంపెనీలో ఉద్యోగం చెయ్యాలి అని ఆశ ఉండటంలో తప్పు లేదు కానీ మొదటి అడుగుగా ఏదో ఒక కంపెనీ లో ఉద్యోగం సాధించి ప్రయాణం మొదలు పెట్టాలని లోకేష్ సూచించారు...ఆ తర్వాత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు.