//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపిని వద్దంటున్న మిత్రపక్షాలు

Category : national politics

కేంద్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉప ఎన్నికల్లో విపక్షాల ఐక్యత ముందు మట్టికరించింది. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 14 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో 11 చోట్ల పరాజయం పాలయింది. ముఖ్యంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభలో ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. గత నెల 28న ఉప ఎన్నికలు నిర్వహించగా గురువారం ఫలితాలను ప్రకటించారు. మూడు చోట్ల మాత్రమే భాజపా కూటమి విజయం సాధించింది.

2019లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతకు ముందు జరిగే ప్రతి ఉప ఎన్నికా రాజకీయంగా కీలకమయిన నేపథ్యంలో తాజా ఫలితాలు.. కమలదళానికి మింగుడుపడని అంశమే. భాజపాయేతర పక్షాల ఐక్యతను బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ సహా విపక్షాలు గట్టి పట్టుదలతో ఉన్న నేపథ్యంలో ఈ ఫలితాలు వాటిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. నాలుగేళ్ల మోదీ ప్రభుత్వ పాలనకు, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని అభివర్ణించాయి.

వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలకు, పునరేకీకరణలకు నాందిగా భావిస్తున్న ఈ ఉప ఎన్నికలను అటు అధికార భాజపా, ఇటు విపక్షాలు ఎంతో కీలకంగా భావించాయి. సర్వశక్తులూ ఒడ్డాయి. నాలుగు లోక్‌సభ స్థానాలు- కైరానా(ఉత్తర్‌ప్రదేశ్‌), భండారా-గోండియా, పాల్‌ఘర్‌(మహారాష్ట్ర), నాగాలాండ్‌లో ఉపఎన్నికలు జరగగా భాజపా సిట్టింగ్‌ స్థానమైన పాల్‌ఘర్‌లో పరువు కాపాడుకుంది. ఇక్కడ భాజపా మిత్రపక్షం శివసేనే ప్రత్యర్థిగా నిలిచింది. విపక్షం గట్టిపోటీ ఇవ్వలేకపోయింది.

భాజపాకు చెందిన రాజేంద్ర గావిట్‌... శివసేన అభ్యర్థి శ్రీనివాస్‌ వనగాపై విజయం సాధించారు. ఇక్కడ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. మరో రెండు సిట్టింగ్‌ స్థానాలు కైరానా, భండారా-గోండియాను కోల్పోవడం భాజపాకు గట్టి దెబ్బే. ముఖ్యంగా కైరానా ఓటమి కమలదళం జీర్ణించుకోలేని అంశం. ఇక్కడ విపక్షాలన్నీ కలిపి భాజపాకు వ్యతిరేకంగా ఆర్‌ఎల్‌డీ నుంచి తబస్సుమ్‌ హసన్‌ను బరిలో నిలిపాయి.

విపక్షాల ఐక్యతను చాటుతూ ఆమె తిరుగులేని ఆధిక్యంతో గెలవడంతో కమలదళం పరవు పోయింది. నాగాలాండ్‌లో భాజపా మిత్రపక్షమైన నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ) గెలిచింది. లోక్‌సభ ఫలితాలు భాజపా కూటమి, విపక్షాలకు చెరిసమానంగా వచ్చినా పది శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కమలదళం చావు దెబ్బ తింది. ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రమే గెల్చింది. మేఘలాయ, పంజాబ్‌లో ఉప ఎన్నికలు నిర్వహించిన ఒక్కో స్థానంలో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగరవేయగా...

ఝార్ఖండ్‌లో రెండు స్థానాల్లో జేఎంఎం, కేరళలో సీపీఎం, ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బిహార్‌లో ఆర్‌జేడీ, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఒక్కోస్థానంలో గెలిచాయి. బిహార్‌లోని జోకీహాట్‌లో ఆర్జేడీ అభ్యర్థి షా నవాజ్‌ ఆలం.. జేడీయూ అభ్యర్థి ముర్షీద్‌ ఆలంపై 41వేల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. జేడీయూ తన సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింది.కర్ణాటకలోని ఆర్‌ఆర్‌ నగర్‌కు ఇటీవల ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో మిగిలిన ఉప ఎన్నికలతో పాటు నిర్వహించారు. ఆ స్థానంలోనూ కాంగ్రెస్‌ జయకేతనం ఎగరవేసింది.

2013 ఎన్నికల్లోనూ ఈ స్థానం కాంగ్రెస్‌దే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నూర్‌పుర్‌.. భాజపా సిట్టింగ్‌ స్థానంకాగా దాన్ని మళ్లీ కైవసం చేసుకోలేకపోయింది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి అవనిసింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నయీముల్‌ హసన్‌ గెలుపొందారు. పంజాబ్‌లోని షాకోట్‌.. భాజపా మిత్రపక్షమైన అకాలీదళ్‌ సిట్టింగ్‌ స్థానం కాగా దాన్నీ మిత్రపక్షాలు కాపాడుకోలేకపోయాయి. మరోవైపు కేరళలో సీపీఎం, ఝార్ఖండ్‌లో జేఎంఎం, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తమ సిట్టింగ్‌ స్థానాలను మళ్లీ గెల్చుకొన్నాయి.

మహారాష్ట్రలో పాలస్‌-కడేగావ్‌ స్థానంలో ఇతర పార్టీలేమీ అభ్యర్థులను నిలపకపోవడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ఇప్పుడు బిజెపి మళ్ళి అధికారంలోకి వస్తుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు మోడీ ఆదరణ ఎంతగానో ఉందని భావించిన మిత్ర పక్షాలు సైతం జాగ్రత్త పడటం మొదలుపెట్టాయి. మోడీ వేవ్ అనేది గతమని ఇప్పుడు ప్రజలను ఆయన సాధారణ నాయకుడనే అనుకుంటున్నారని మనం ఇంకా ఆయనతోనే ఉంటె మన మనుగడ కూడా ప్రశ్నార్ధకంగా మారుతుందనే అభిప్రాయంలో వారు ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.