సార్వత్రిక ఎన్నికల కొస౦ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతుంది. కర్ణాటకలో జెడిఎస్ కాంగ్రెస్ పొత్తుని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తుంది. మంత్రివర్గ ఏర్పాటుపై చర్చల కోసం కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి ఢిల్లీ వెళ్తున్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా కాంగ్రెస్ కీలక నేతలు మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య, వేణుగోపాల్, పరమేశ్వర్, డి.కె.శివకుమార్‌లు కుమారస్వామితో చర్చలు జరిపారు.
కుమారస్వామితో పాటు సిద్దరామయ్య, పరమేశ్వర్, డి.కె.శివకుమార్ తదితరులు ఢిల్లీకి వెళుతున్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలోనే మంత్రి వర్గ కూర్పు సహా తదితర అంశాలపై తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో జెడిఎస్ కి కాంగ్రెస్ బేషరతు మద్దతు ప్రకటించినా కేబినెట్లో స్థానాలు, డీసీఎం వంటి పదవులను వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్దంగా లేదు.
ఇక కాంగ్రెస్ అధిష్ఠానం కోరుకుంటున్నట్టే బీజేపీ వ్యతిరేక కూటమికి కుమారస్వామి ఆధ్వర్యంలో అడుగులు పడేలా వివిధ రాష్ట్రాల కీలక నేతలను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించే విషయంలో సోనియాగాంధీ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్‌ల కూటమితో 2019 లోకసభ ఎన్నికలపైనా ఇప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుత ఎన్నికల్లో జేడీఎస్ అత్యధిక స్థానాలు సాధించిన మండ్య, హాసన్, రామనగర, తుమకూరు, మైసూరు జిల్లాలను ఆ పార్టీకి వదిలేసి మిగిలిన చోట్ల జేడీఎస్ మైత్రితో కాంగ్రెస్ పోటీ చేసే అంశం కూడా కీలకం అవుతోంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఫెడరల్ ఫ్రంట్ కి జెడిఎస్ దాదాపుగా దూరం జరిగినట్టే. ఇప్పటికే మమత బెనర్జీ, మాయావతి వంటి కీలక నేతలు జెడిఎస్ ని కాంగ్రెస్ తో కలవమని సూచించిన నేపధ్యంలో ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ తుదిరూపు దాల్చే అవకాశాలు స్పష్టంగా లేవని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు