//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అన్నింటా కేరళ ముందంజ.

Category : national

ఆరోగ్యాన్ని దూరం చేస్తున్న ప్రభుత్వాలు ప్రజా కంటక ప్రభుత్వాల కిందే లెక్క. ప్రజారోగ్యానికి కేంద్ర ప్రభుత్వమూ, అనేక రాష్ట్ర ప్రభుత్వాలూ కల్పిస్తున్న ప్రాధాన్యత బహుస్వల్పమని చెప్పడానికి ఎన్నో సజీవ సాక్ష్యాలున్నాయి. నిన్న మొన్నటి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బిడిఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రి మొదలుపెట్టి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పిల్లల వైద్యశాలను దాటుకొని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి మన్యంలో గిరిజనుల మరణాల వరకు ప్రభుత్వాల వైఫల్యాలు కోకొల్లలు. ఈ దౌర్భాగ్య స్థితికి ఏలికల విధానాలే కారణం. యూపి, గుజరాత్‌, ఏపి, ఇత్యాది రాష్ట్రాలు ఆరోగ్య సూచీల్లో వెనుకబడడానికీ, కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో ఉండటానికి కారణం అక్కడి పరిపాలకుల చిత్తశుద్ధి, ప్రజల చైతన్యాలే. స్వాతంత్య్రోద్యమంలో కేరళలో అభ్యుదయ, వామపక్ష భావజాలం ప్రజలను ప్రభావితం కావించింది. స్వాతంత్రానంతరం కేరళలో వామపక్ష సంఘటన సర్కారుకు ప్రజలు పట్టం కట్టారు. దేశంలో తొలి కాంగ్రేసేతర ప్రభుత్వం అదే. అప్పుడే కేరళ పరిపాలనలో ప్రజానుకూల సంస్కరణలు పాదుకొల్పాయి. అశేష జనబాహుళ్యానికి అవసరమైన భూసంస్కరణలు, విద్య, వైద్యం వంటి రంగాల్లో ఉద్యమ స్ఫూర్తితో పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఆ ఒరవడిలోనే వందశాతం విద్య సాకారమైంది. ఇప్పటిక్కూడా దేశంలో ఏ రాష్ట్రమూ వంద శాతం అక్షరాస్యత లక్ష్యానికి దరిదాపుల్లోకి కూడా చేరలేదు. ఆ మాటకొస్తే బిజెపి ఏలుబడిలో గుజరాత్‌ అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన పార్టీ బిజెపి, దాన్ని నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌, చెపుతుండగా నేటికీ గుజరాత్‌ వంద శాతం అక్షరాస్యతకు చాలా దూరంలో ఉంది.

కేరళలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాల్లో విద్య, వైద్య రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యతలను మధ్యమధ్యలో వచ్చిన యుడిఎఫ్‌ ప్రభుత్వాలు కొనసాగించక తప్పలేదు. నిర్వీర్యం చేసేందుకు యుడిఎఫ్‌ ఎత్తులు వేసిన ప్రతిసారీ, వామపక్షాల ఆధ్వర్యంలో చైతన్యవంతమైన ప్రజానీకం ఆందోళనలు చేసి అమలు చేసేలా మెడలు వంచారు. ఇదీ విద్య, వైద్యంలో కేరళ అగ్రస్థానంలో ఉండటానికి వెనుక వాస్తవ చరిత్ర. సన్‌రైజ్‌ స్టేట్‌గా చంద్రబాబు అభివర్ణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కూ, కేరళకు ఆరోగ్య సూచీల్లో, ఆ రంగానికి చేసే ఖర్చుల్లో నక్కకూ నాగలోకానికీ ఉన్నంతగా వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు ఈ ఏడాది మొత్తం కేరళ బడ్జెట్‌ రూ.1.19 లక్షల కోట్లు కాగా అందులో వైద్యానికి రూ.6,314 కోట్లు (5.3 శాతం) ప్రతిపాదించగా ఏపీ మొత్తం బడ్జెట్‌ రూ.1.56 లక్షల కోట్లలో ఆరోగ్యానికి కేటాయించింది రూ.7,220 కోట్లు (4.6 శాతం). రాష్ట్ర బడ్జెట్‌ కాక కేరళలో పంచాయతీలకు బదిలీ చేసే నిధుల్లో 30 శాతం ఆరోగ్యానికి ఖర్చు చేస్తారు. ఆరోగ్య సూచీల విషయానికొస్తే నవజాత శిశు మరణాలు ప్రతి వెయ్యికీ కేరళలో 6, ఏపీలో 35, ఐదేళ్లలోపు పిల్లల మరణాలు కేరళలో 7- ఎపీలో41, బాలింత మరణాలు ప్రతి లక్షకూ కేరళలో61- ఎపీలో 90, ప్రతి వెయ్యి మంది బాలురకు బాలికలు కేరళలో 1,084- ఎపీలో 933, ఆస్పత్రుల్లో ప్రసవాలు కేరళలో 99.9- ఎపీలో 91.6.... ఇలా ఏ సూచీలోనూ కేరళ ముందు ఏపీ సరితూగదు. చంద్రబాబు సర్కారు మోడీ బాటలో స్వచ్ఛ భారత్‌ అని గావుకేకలు పెడుతున్నప్పటికీ పారిశుధ్య పనుల్లో కేరళ స్థానం 98 కాగా ఏపీకి దక్కిన స్టేటస్‌ 53. ఒక్క ఏపీయే కాదు దేశంలోనే కేరళ ఆరోగ్య సూచీల్లో అగ్రస్థానంలో ఉంది. అందుకే ఆ రాష్ట్ర ఆరోగ్య రహస్యం తెలుసుకునేందుకు అనేక అధ్యయనాలు జరిగాయి, జరుగుతున్నాయి.

రాజ్యాంగం ప్రజలకు జీవించే హక్కును ప్రసాదించింది. అందుకనగుణంగా ఆరోగ్యంపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాలి. కానీ రోజురోజుకూ వైద్య, ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యయం తగ్గుతోంది. ప్రజలను ప్రైవేటు, కార్పొరేట్‌ చేతుల్లో పెడుతున్నాయి. నూట ఇరవై కోట్లకు పైన జనాభా ఆరోగ్యానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్నది కేవలం ఒక్క శాతం నిధులనే. ఈ విషయంలో మయన్మార్‌, సూడాన్‌, పాకిస్థాన్‌ కంటే భారత్‌ వెనుకబడి ఉంది. ఆరోగ్య సూచీల్లో మనదేశం చివరి నుంచి 12వ స్థానంలో ఉంది. ఈ దుష్టాంతాలు ప్రజల ఆరోగ్యంపై పాలకులకు ఏ మాత్రం శ్రద్ధ లేదని తెలుపుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్యం కునారిల్లుతోంది. సర్కారు దవాఖానాలు నరక కూపాలయ్యాయి. ఈ దేశ రాజ్యాంగ పరిధుల్లోనే, పరిమిత వనరులతోనే కేరళలో ఎల్‌డిఎఫ్‌ హయాంలో ప్రభుత్వరంగంలో వైద్య రంగాన్ని పటిష్టం చేశారు. ఎల్‌డిఎఫ్‌ తాజాగా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ పలు ఆరోగ్య పథకాలు ప్రవేశపెట్టారు. తమ రాష్ట్రానికి పనుల కోసం వలస వచ్చే కార్మికులు, ఉద్యోగం లేని వారి కోసం వేర్వేరు ఆరోగ్య బీమా పథకాలు తెచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాల కోసం బారి నిడులూ కేటాయించాల్సిన అవసరం ఉంది.