//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బలాలయ మహాసంప్రోక్షణకి అంకురార్పణ....విశేషాలు....!

Category : editorial state

కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కి 12 ఏళ్ళకి ఒక్కసారి నిర్వహించే బలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నేటి రాత్రి ఏడు గంటలకు అంకురార్పణ చేయనున్నారు . నేటి నుంచి 16 వరకు శ్రీవారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోషణ కార్యక్రమం జరుగనుంది.

మహాసంప్రోక్షణ కార్యక్రమం ఉన్నందున ఈ ఐదు రోజులపాటు ప్రత్యేక దర్శనాలతో పాటు ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. నేటి నుంచి పరిమిత సంఖ్యలోనే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనుంది. మహాసంప్రోక్షణ కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి 45 మంది రుత్వికులు తిరుమలకు చేరుకున్నారు.

ఈ రోజు ఉదయం భగవంతుని అనుమతితో ఆచార్యులకు స్థాన నిర్ణయం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు విష్వక్సేనుల ఊరేగింపు, రాత్రి 9-10 గంటల మధ్య యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ చేస్తారు.

శ్రీవారి ఆలయ నిర్వహణ బాధ్యతలు టీటీడీకి ఆధీనమైన తర్వాత... ప్రతి పన్నెండేళ్లకోసారి ఆనంద నిలయ విమాన జీర్ణోద్ధరణ చేపడుతున్నారు. తొలిసారిగా 1958లో ఆగస్టు 19నుంచి 27వరకు మహాసంప్రోక్షణ జరిగింది. అప్పటో 12 టన్నుల రాగి, 12 వేల తులాల మేలిమి బంగారాన్ని ఆనందనిలయ నవీకరణకు వినియోగించారు.

మొదటి రోజు విశేషాలు :

ఉదయం 6 గంటలకు యాగశాలలో హోమగుండాలను వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం చేస్తారు. రాత్రి 9 గంటల తరువాత కళాకర్షణలో భాగంగా గర్భాలయంతోపాటు అన్ని ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం (కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతోపాటు అందరు దేవతల ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపుచేస్తారు. మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువుదీస్తారు. యాగశాలలో ప్రతిరోజూ నిత్య కైంకర్యాలతో పాటు హోమాలు నిర్వహిస్తారు.

రెండు , మూడురోజుల్లో విశేషాలు :

విశేష హోమాలతోపాటు ఎనిమిది రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తారు. దీనిని గర్భాలయంలో పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, ఉప ఆలయాల్లో సమర్పిస్తారు.

నాల్గవ రోజు విశేషాలు :

ఉదయం కైంకర్యాల అనంతరం మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గర్భాలయంలోని మూలవర్లకు 14 కలశాలతో మహాశాంతి తిరుమంజనం చేస్తారు. అదే సమయంలో యాగశాలలోని ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.

చివరి రోజు విశేషాలు :

ఉదయం 10.16 గంటల నుంచి మధ్యాహ్నం 12లోపు కళావాహన చేస్తారు. మూలమూర్తికి, విమానగోపురానికి, ఉప ఆలయాల్లోని విగ్రహాలకు, గోపురాలకు కుంభంలోని శక్తిని తిరిగి ఆవాహనం చేస్తారు. ఆ తర్వాత ఆరాధన, వైవేద్యం, అక్షతారోపణం, బ్రహ్మఘోష, అర్చక బహుమానం సమర్పిస్తారు. ఈ కార్యక్రమంతో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు పరిసమాప్తమవుతుంది. చివరగా మలయప్పస్వామి పెద్దశేష, గరుడ వాహనాల్లో తిరువీధులలో ఊరేగుతూ భక్తకోటిని కటాక్షిస్తారు. దీనితో మహాసంప్రోక్షణ మహత్కార్యం ముగుస్తుంది

ఈ మొత్తం క్రతువులో ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు ఆధ్వర్యంలో 45మంది రుత్వికులు, వందమంది వేదపండితులు, 20మంది వేదపాఠశాల విద్యార్థులు పాల్గొంటారు.

Related News