శాస్త్రవేత్తగా సమున్నత శిఖరాలు అధిరోహించిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం అంతగా సంతృప్తి చెందలేకపోయారట. ప్రస్తుతం క్రిస్టీ ముందు వేలానికి వచ్చిన లేఖలు ఈ సంగతిని తెలియజేస్తున్నాయి. జీవితకాల మిత్రుడు, సహ పరిశోధకుడు మిచెల్ బెస్సోతో ఐన్స్టీన్ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను త్వరలో వేలం వేయబోతున్నారు. మిచెల్ ప్రశాంతంగా జీవించాడు. దీర్ఘకాలం భార్యతో సహజీవనం సాగించాడు. వైవాహిక జీవితం విషయంలో నేను మాత్రం రెండుసార్లు దారుణంగా విఫలమయ్యాను అని బెస్సో మరణించినపుడు ఆయన కుటుంబానికి 1955 మార్చి 21న రాసిన లేఖలో ఐన్స్టీన్ పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్నివారాలకే ఐన్స్టీన్ కూడా మరణించారు. మొదటి భార్య మిలేవాతో గొడవలు వచ్చి 1919లో ఐన్స్టీన్ విడాకులు తీసుకున్నారు. తర్వాత దగ్గరి బంధువైన ఎల్సాను పెండ్లి చేసుకున్నారు. ఈ రెండు పెండ్లిళ్లపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.