సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లాలని భావిస్తున్న హైదరాబాదీలను ఇప్పటికే ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ అడ్డగోలుగా దోపిడీ చేస్తుండగా, ఆ జాబితాలోకి విమానయాన సంస్థలు కూడా దిగిపోయాయి.
బస్సుల్లో టికెట్లు దొరకక, రైళ్లలో వెయిటింగ్ లిస్టు చాంతాడంత పెరిగిపోయిన నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే, నేడు విమాన టికెట్ రూ. 18 వేలుగా చూపిస్తోంది. ఇక విజయవాడ వెళ్లాలంటే రూ. 12,931 చెల్లించుకోవాల్సిన పరిస్థితి.
హైదరాబాద్ ఎయిర్ పోర్టుల్లో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి కౌంటర్లు చాలా బిజీగా కనిపిస్తున్నాయి. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా అయినా పలువురు ప్రయాణానికి మొగ్గు చూపుతుండటం, ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థలు డైనమిక్ ప్రైసింగ్ విధానానికి తెర తీశాయని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంత ధరపై కూడా టికెట్ లను కొనుక్కొని వెళుతున్న వారు కనిపిస్తుండటం గమనార్హం.