//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎయిర్‌కోస్టా ప్రయాణం ఆగిపోయినట్లేనా?

Category : business

నిధుల కొరతతో విమాన సేవలను నిలిపివేసిన ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. దేశీయంగా విమాన సేవలను అందించడానికి విమానాలకు ఇచ్చిన కోడ్‌ను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) రద్దు (డీరిజిస్ట్రేషన్‌) చేసింది. పౌర విమాన రిజిస్టరు నుంచి ఈ రెండు విమానాలను తొలగించినట్లు ఎయిర్‌కోస్టాకు డీజీసీఏ లేఖ రాసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. నిధుల కొరతతోపాటు, విమానాలను అద్దెకిచ్చిన జీఈ కేపిటల్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌ (జీఈసీఏఎస్‌)తో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి చివరి వారంలో ఎయిర్‌కోస్టా సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. మే చివరి వరకూ సేవలను తిరిగి ప్రారంభించే అవకాశం లేదని ఇటీవల ప్రకటించింది. ‘ఎయిర్‌కోస్టా విమానాలను అద్దెకు మాత్రమే తీసుకుంది. విమానాలు అద్దెకు ఇచ్చిన వారి ఆధీనంలో ఉంటాయి. ప్రస్తుతం అవి ఖాళీగా ఉన్నాయి. అద్దెకు ఇచ్చిన కంపెనీ వినతి మేరకు విమానాల కోడ్‌ను డీజీసీఏ రిజిస్టర్‌ నుంచి తొలగించింద’ని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ విమానాలతో ఇక ఎయిర్‌కోస్టాకు ఎటువంటి సంబంధం ఉండదని, అద్దెకిచ్చిన కంపెనీ ఆ విమానాలను వెనక్కి తీసుకువెళ్లొచ్చు. లేదా ఇక్కడే మరో విమానయాన సంస్థకు అద్దెకు ఇవ్వవచ్చు. అది జీఈసీఏఎస్‌ ఇష్టమని వివరించాయి. అయితే.. నిధుల కోసం జరుగుతున్న చర్చలు త్వరలోనే ఫలవంతం కాగలవని, విమానాలను ఎయిర్‌కోస్టానే ఉపయోగించుకోగలదని భావిస్తున్నామని పేర్కొన్నాయి. జీఈ కేపిటల్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌ నుంచి తీసుకున్న రెండు ఎంబ్రార్‌ విమానాల ద్వారా ఎనిమిది నగరాలకు ఎయిర్‌కోస్టా సేవలందిస్తోంది. దేశ వ్యాప్తంగా సేవలందించడానికి గత ఏడాది అక్టోబరులో డీజీసీఏ నుంచి లైసెన్సు కూడా పొందింది.

అనుకున్న విధంగా నిధులు లభించకపోతే ఎయిర్‌కోస్టా సేవలు నిలిచిపోతాయా అన్నది భవిష్యత్తులో తేలాల్సిన ప్రశ్న. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి సేవలను నిలిపివేయడంతో ఇప్పటికే 40 మంది పైలట్లతోపాటు మొత్తం 150 మంది ఉద్యోగులు ఎయిర్‌కోస్టాను విడిచి బయటకు వెళ్లారు. సంక్షోభానికి ముందు వరకూ 600 మంది కంపెనీలో పని చేస్తున్నారు. డీజీసీఏ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 2015-16లో ఎయిర్‌కోస్టా రూ.327 కోట్ల ఆదాయంపై రూ.130 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఒక్కో విమానం నుంచి ఎయిర్‌కోస్టాకు నెలకు రూ.6-7 కోట్ల ఆదాయం లభిస్తుంటే.. అద్దె కిందే రూ.3.5-4 కోట్లు చెల్లిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అద్దెకే రూ.4 కోట్ల వరకూ పోతుంటే.. విమానాశ్రయాల ఛార్జీలు, ఉద్యోగుల వేతనాలు, ఇంధన ఖర్చులు మొదలైన వాటితో కంపెనీపై భారం పెరిగిపోయిందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఒక వైపు నిధుల సమీకరణకు చర్చలు జరుపుతూ.మరో వైపు అద్దెను తగ్గించాలని అద్దె కంపెనీతో చర్చలు జరుపుతోందని వివరించాయి. ఎయిర్‌కోస్టా నిధుల సమీకరణపై ఆశావహ దృక్పథంతో ఉంది. ‘నిధులు తీసుకురావడానికి ఇద్దరు, ముగ్గురు మదుపర్లతో తీవ్రంగా చర్చలు జరుపుతున్నాం. ఒకటి, రెండు వారాల్లో చర్చలు కొలిక్కి రావచ్చు. మళ్లీ మేం సేవలను ప్రారంభిస్తాం. మే చివరి వరకూ సేవలను రద్దు చేశాం. ఈ లోపే సేవలను తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తున్నాం. జీఈ కేపిటల్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌ తన విమానాలను తీసుకువెళితే మరో కంపెనీ విమానాలను అద్దెకు తీసుకుంటామని’ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఎయిర్‌కోస్టా ప్రతినిధి తెలిపారు. జనవరి నెలకు ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం వేతనాలు కంపెనీ చెల్లించిందని, ఫిబ్రవరి నెలకు కూడా కొంత మందికి చెల్లింపులు చేసిందని వివరించారు. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎయిర్‌కోస్టాను 2013లో ఎల్‌ఈపీఎల్‌ గ్రూప్‌ ప్రారంభించింది. దక్షిణాదిలోనే తొలి ప్రాంతీయ విమానయాన కంపెనీగా గుర్తింపు పొందింది. దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య సగటున ఏడాదికి 20 శాతానికి పైగా వృద్ధి చెందుతున్నప్పటికీ.అధిక ఇంధన ధరలు, విమానాశ్రయాల్లో రుసుములు వంటివి ప్రాంతీయ విమానయాన సంస్థలపై భారం మోపుతున్నాయని.. నిధుల కొరతతో మూతపడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది జులైలో బెంగళూరుకు చెందిన పెగాసస్‌ కార్యకలాపాలను నిలిపి వేసింది. గతంలో రెలిగేర్‌ వాయేజిస్‌కు చెందిన ఎయిర్‌మంత్రా, పారామౌంట్‌ ఎయిర్‌వేస్‌ వంటి కంపెనీలు ప్రాంతీయ విమానయాన సేవలను ప్రారంభించి తర్వాత నిలిపివేశాయి. విమానాల అద్దెను చెల్లించలేకపోవడం, చమురు కంపెనీలకు బకాయి పడి చెల్లించలేకపోవడం వంటివి ఇందుకు కారణాలను పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.