//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విద్యుత్ కోతలు అంతరించి, విద్యుత్ డిమాండ్ తగ్గడంతో ఆందోళన

Category : national

యుపిఎ పాలనలో దేశ వ్యాప్తంగా దాదాపు అంతటా తీవ్రమైన విద్యుత్ కొరత ఏర్పడింది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ కొరతను అధిగమిస్తున్నా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ కు డిమాండ్ తగ్గిపోతూ ఉండడంతో భారీ పెట్టుబడులతో ప్రైవేట్ రంగంలో స్థాపించిన విద్యుత్ ప్రాజెక్ట్ ల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది.

విద్యుత్ సంస్కరణల ద్వారా విద్యుత్ పంపిణి సంస్థలను పటిష్ట పరచడం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా రెండేళ్ల క్రితం  ప్రవేశపెట్టిన  ఉజ్వల్‌ డిస్కమ్‌ అష్యూరెన్స్‌ యోజన (`ఉదయ్') పథకం ఆచరణలో విఫలం అవుతూఉండడంతో   విద్యుత్ రంగంలో సరికొత్త సమస్యలకు దారితీస్తుంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌కు డిమాండ్‌ క్రమంగా తగ్గిపోతున్నట్లు స్పష్టం అవుతున్నది.

విద్యుత్‌ పంపిణీ రంగంలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారంగా చెబుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సంస్కరణ విద్యుత్‌ పరిశ్రమకు మరింత ఆదాయం తెచ్చిపెడుతుందని భావించినప్పటికీ, కేవలం తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం  కలిగించలేక పోతున్నట్లు వెల్లడి అవుతున్నది.

2019-20 నాటికి నిరంతర విద్యుత్‌ సరఫరా అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన `ఉదయ్' ఇప్పుడు శిరోభారంగా మారుతున్నది. విద్యుత్‌ ఉత్పాదన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు పట్ల ఆసక్తి చూపుతూ ఉండడంతో ఇప్పటికే ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పరిస్థితి అయోమయంలో పడుతున్నది.

విద్యుత్‌ కొనుగోలుకు సంబంధించి 25 ఏళ్ల కాల పరిమితితో కుదుర్చుకున్న ఈ ఒప్పందాలను ఇప్పటి వరకూ విద్యుత్ ఉత్పత్తిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నట్లు భావిస్తున్నారు. అందుకనే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఆయా ప్రాజెక్టులకు భారీ ఆర్థిక సహాయాన్ని అందించాయి. ఇప్పుడు సౌరవిద్యుత్‌ గణనీయంగా అందుబాటులోకి వస్తూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కొనుగోలు టారిఫ్‌లను తగ్గించాలని భావిస్తున్నాయి.

అనూహ్యమైన ఈ తగ్గింపుతో తమ ఆదాయానికి గండిపడుతుండటంతో ప్రాజెక్టు డెవలపర్లు తాము తీసుకున్న రుణాల చెల్లింపులో వెనుకంజ వేస్తున్నారు. దీనితో ఆయా ప్రాజెక్టులకు రుణసహాయం అందించిన ఆర్థిక సంస్థలకు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం పంపిణీ సంస్థలు కూడా పవన విద్యుత్‌ ఉత్పాదక సంస్థల నుండి కొత్త కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియకు తెరదించాయి. దీనితో దాదాపు 3 వేల మె.వా విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంతో నిర్మితమవుతున్న ప్రాజెక్టుల్లో తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది.

గతంలో అంగీకరించిన టారిఫ్‌ల ప్రకారం ఒప్పందాలు కుదుర్చుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఖాతరు చేయడం లేదు. రాష్ట్రాల చర్యలను ఇన్వెస్టర్లు, రుణదాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో కేంద్రం తలపెట్టిన కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పాదన ప్రణాళికలు అటకెక్కే ప్రమాదం కన్పిస్తోంది. దీనితో పాటు పారిస్‌ ఒప్పందం ప్రకారం కాలుష్య ఉద్గారాల తగ్గింపుకు భారత్‌ చేసిన అంగీకారంపై కూడా ఇది తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించనున్నది.