ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దాణా కుంభకోణం కేసులో ఆయనపై విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీం కోర్ట్ స్పష్టం చేయడంతో తిరిగి దర్యాప్తు ఎదుర్కొనవలసి పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు ఝార్ఖండ్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. ఈ తీర్పుతో 2019 ఎన్నికలకు ముందుగా బిజెపి వ్యతిరేక ప్రతిపక్షాల కూటమి ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలలో, ఆయన క్రియాశీల పాత్ర వహించలేని పరిస్థితి నెలకొంది. కూటమి కన్వీనర్ గా ప్రధాన మంత్రి పదవిపై దృష్టి సారిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు స్వరాష్ట్రంలో ఎదురులేని పరిస్థితి నెలకొన్నట్లయ్యింది.
1996లో దాణా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పశుగ్రాసం పేరుతో రూ. 900 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని లాలూ ప్రసాద్ యాదవ్ సహా పలువురిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో లాలూ దోషిగా తేలడంతో 2013 అక్టోబర్లో మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే అదే ఏడాది డిసెంబర్లో ఆయనకు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ మంజూరైంది. మిగతా మూడు కేసుల్లోను లాలూను విచారించాల్సి ఉంది. ఆ మూడు కేసుల నుంచి 2014లో ఝార్ఖండ్ హైకోర్టు లాలూకు వూరటనిచ్చింది. ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తిని అదే సాక్ష్యాలు, ఆధారాలతో మరో కేసుల్లో విచారించరాదని ఝార్ఖండ్ కోర్టు చెప్పింది. దీంతో ఆయనపై అభియోగాలను ఉపసంహరించకున్నారు.
అయితే ఈ తీర్పును సీబీఐ వ్యతిరేకించింది. మిగతా కేసుల్లోనూ లాలూపై విచారణకొనసాగించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం సీబీఐ వాదనలతో ఏకీభవించింది. దర్యాప్తు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది.పైగా హై కోర్ట్ తీర్పు ను సవాల్ చేయడంలో సిబిఐ జాప్యం చేయడం, ప్రాధాన్యత గల ఈ కేసును డైరెక్టర్ స్వయంగా చేపట్టకుండా ఒక అధికారికి అప్పచెప్పడం పట్ల సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.