దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తాను వెంటనే వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. 14 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో అసాధారణ రికార్డుల్ని తన పాదాక్రాంతం చేసుకున్న ఏబీ డివిలియర్స్.. 2019లో దక్షిణాఫ్రికా జట్టుకి ప్రపంచకప్‌ను అందించడమే తన స్వప్నమని ఇటీవల చెప్పాడు. కానీ.. ఈ రోజు సడన్‌గా రిటైర్మెంట్కి ఇదే తగిన సమయం. అందుకే.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని ప్రకటించేశాడు.
మిస్టర్ 360గా పేరుగాంచిన ఎబి అన్నిరకాల క్రికెట్ ఫార్మట్ లకు నేడు రిటైర్మెంట్ ప్రకటించారు. భవిష్యత్తులో కౌంటీ క్రికెట్ లో ఆడతానో లేదో చెప్పలేనన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 34 సంవత్సరాలు. తన 14 ఏళ్ళ క్రికెట్ కెరీర్ లో 114 టెస్ట్ లు, 228 వన్డేలు, 78 టి20 మ్యాచ్ లు ఆడిన ఎబి, కెరీర్లో తన అద్భుత బాటింగ్ నైపుణ్యంతో విధ్వంసకర బ్యాట్స్ మాన్ గా పేరు గాంచాడు. ఇప్పటికే తాను కెరీర్ పరంగా అలసిపోయానని, ఇక క్రికెట్ కు సెలవు ప్రకటించే సమయం వచ్చిందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పోస్ట్ చేస్తూ తెలిపారు.
ఇక ఇప్పటివరకు నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకి థ్యాంక్స్ అని డివిలియర్స్ వెల్లడించాడు. అయితే.. ఐపీఎల్లో ఆడే విషయంపై డివిలియర్స్ స్పష్టత ఇవ్వలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి సుదీర్ఘకాలంగా డివిలియర్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్.. 114 టెస్టుల్లో రెండు ద్విశతకాలు, 22 శతకాలు, 46 అర్ధశతకాలు సాధించాడు. 228 వన్డేలాడి 25 సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు చేశాడు. టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికా తరఫున సెంచరీ చేయలేకపోయినా.. ఐపీఎల్లో మాత్రం ఈ హిట్టర్ మూడు సెంచరీలు బాది తన ముచ్చట తీర్చుకున్నాడు. అయితే సడన్‌గా ఏపీ తీసుకున్న నిర్ణయం క్రికెట్ అభిమానులకు పెద్ద షాకే అని చెప్పాలి.