//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక ఆధార్ - పాన్ లింక్ తప్పనిసరి

Category : national

పన్ను చెల్లింపుదారులందరూ తమ పాన్ నంబర్‌ను తప్పనిసరిగా ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలు జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఆదాయపన్ను నిబంధనలను సవరించిన ప్రభుత్వం పాన్ దరఖాస్తుకు కూడా ఆధార్ తప్పనిసరి అని స్పష్టంచేసింది. 

2017-18 ఆర్థిక బిల్లులో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆదాయ పన్నుచెల్లింపులకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. పాన్ కార్డులను దుర్వినియోగం చేసి పన్ను ఎగవేసే వారిని అరికట్టేందుకు పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న నిబంధన పెట్టారు. 

ఈ ఏడాది జూలై ఒకటి నాటికి పాన్ నంబర్ పొందిన వారు, సెక్షన్ 139ఏఏ, సబ్ సెక్షన్ (2) పరిధిలోకి వచ్చే వారందరూ తప్పనిసరిగా తమ ఆధార్ నంబర్‌ను ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలి అని కేంద్ర రెవెన్యూ విభాగం స్పష్టం చేసింది. పాన్ దరఖాస్తుతో జతచేసిన పత్రాలను లేదా ఆధార్ సమాచారాన్ని పరిశీలించే అధికారాన్ని ప్రిన్సిపల్ డీజీఐటీ (సిస్టమ్స్) లేదా డీజీఐటీ (సిస్టమ్స్)కు అప్పగించింది. 

దేశంలో ఇప్పటికే 2.07 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్ నంబర్‌ను పాన్‌తో అనుసంధానం చేశారు. కాగా దేశంలో 25కోట్ల మందికి పైగా పాన్ నంబర్ ఉండగా, ప్రభుత్వం 115 కోట్ల మందికి ఆధార్ నంబర్‌ను జారీ చేసింది. 

ఆదాయ పన్ను చెల్లింపులకు, పాన్ కార్డులు పొందడానికి ఆధార్‌ను తప్పనిసరి చేసిన ఆదాయ పన్ను చట్టం నిబంధన సరైనదేనని సుప్రీంకోర్టు ఈ నెలారంభంలో పేర్కొంది. అయితే గోప్యత హక్కుపై రాజ్యాంగ ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకొనే వరకు దానిపై పాక్షికంగా స్టే విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రెవెన్యూ విభాగం ఆదాయ పన్ను చట్టం నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది.