ఒబామా ప్రభుత్వం H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికాలో ఉద్యోగావకాశాలను కల్పించింది. అంతకు పూర్వం డిపెండెంట్ వీసా ఆయన H4 పై అమెరికా వచ్చినవారు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఒబామా ప్రభుత్వ నిర్ణయంపై 'సేవ్ జాబ్స్ యూఎస్ఏ' అనే కాలిఫోర్నియాకు చెందిన ఐటీ ఉద్యోగుల బృందం దిగువ కోర్టుకు వెళ్లగా, కోర్టు వీరి వ్యాజ్యన్ని తిరస్కరించింది. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు 'డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా' అప్పీల్ కోర్టును తిరిగి ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం ట్రంప్ ప్రభుత్వ వైఖరిని తెలుపమని కోరగా ప్రభుత్వం 60 రోజుల గడువుకోరింది. అయితే సోమవారం అనగా ఏప్రిల్ 10 వ తారీఖున ఆ గడువు ముగిసింది. కానీ ప్రభుత్వం ఏ నిర్ణయం గడువు లోపల తీసుకోలేకపోయింది. అందుకని ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేసే గడువును సెప్టెంబర్ 27 వరకు పొడిగించమని అప్పీళ్ల కోర్టును ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ నిర్ణయంపై స్పందిస్తూ న్యాయశాఖ అధికార ప్రతినిధి 'సారా ఇస్గుర్ ఫ్లోర్స్' చట్టపరిధిలో అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకై ప్రభుత్వం పాటుపడనుందని అన్నారు. అయితే పిటిషన్ దారులు మాత్రం జాప్యం చేయడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా తమ నిర్ణయాన్ని వెలువరించాలని కోరారు. అంటే మరో ఆరు నెలలు H4 వీసాదారులకు ఊరట లభించిందన్నమాట, తర్వాత ఏమౌతుందంటారా నందోరాజా భవిష్యతి !