//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అంటార్కిటికా ఖండం నుంచి విడిపోయిన పెద్ద మంచుకొండ

Category : editorial

అంటార్కిటికా ఖండం నుంచి ఒక పెద్ద మంచుకొండ విడిపోయింది. కొన్ని నెలల క్రితం అంచనా వేసిన ఈ పరిణామం ఇప్పుడు సంభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందువల్ల సముద్రమట్టం మూడు మిల్లీమీటర్లు పెరుగుతుందని, ఇది దక్షిణ ధ్రువంలో నౌకల సంచారానికి ఎంతో ప్రమాదకరమని హెచ్చరించారు. కాబట్టి సముద్రంలో ఈ హిమపర్వతం ఏ దిశగా కదులుతుందన్నది కనిపెట్టవలసి ఉంటుందని వారు చెప్పారు. 

54,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ మంచుకొండ లక్ష కోట్ల టన్నుల బరువుంటుందని, ఇంతవరకు గుర్తించిన భారీ హిమపర్వతాల్లో ఇదే పెద్దదని పేర్కొన్నారు. ఇది అమెరికాలోని డెలావేర్ రాష్ట్రం అంత పెద్దగా, లండన్ నగర పరిమాణానికి నాలుగు రెట్లు అధికంగా, మహా సరస్సుల్లో ఒకటైన లేక్ ఎరీ కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ మంచుకొండ విడిపోవడం వల్ల అంటార్కిటికా ఖండంలోని లార్సన్ సీ ప్రాంత విస్తీర్ణం12శాతం తగ్గిపోయిందని, అంటార్కిటికా మంచుపీఠభూమి ఆకృతి శాశ్వతంగా మారిందని వారు వెల్లడించారు.

విడిపోయిన మంచుకొండకు ఏ-68 అని నామకరణం చేయాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు. అంటార్కిటికా నుంచి భారీ మంచుపర్వతం చివరగా వేరుపడటం గత మూడు రోజుల్లోనే జరిగి ఉంటుందని బ్రిటన్‌లోని స్వాన్సీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అడ్రియన్ ల్యూక్‌మన్ తెలిపారు. ఈ హిమపర్వతం వేరుకావడాన్ని నాసాలోని ఆక్వా మోడిస్ ఉపగ్రహ పరికరం కనిపెట్టింది. అంటార్కిటికా భూభాగానికి ఈ మంచుకొండకు మధ్య చీలిక ఏర్పడుతున్న విషయం గత ఏడాదే యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఉప్రగహం మొదట గమనించింది. 

ప్రస్తుతం వేరుపడిన మంచుకొండ కొన్ని దశాబ్దాలపాటు స్థిరంగా ఉండవచ్చు లేదా అది మరిన్ని చిన్న భాగాలుగా విడిపోవచ్చునని, ఈ పరిణామం లార్సన్‌సీ ప్రాంతంపై ప్రభావం చూపుతుందని ల్యూక్‌మన్ చెప్పారు. 200 నుంచి 600 మీటర్ల మందంతో ఉన్న లార్సన్‌సీ హిమపర్వత ప్రాంతం కూడా అంటార్కిటికా సముద్రం తీరంలో తేలియాడుతుందన్నారు.