//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

97 శాతం గోరక్షకుల దాడులు మోడీ హయాంలోనే !

Category : national

గోరక్షకులమని చెప్పుకునే బృందాల అరాచకాలు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పెచ్చరిల్లాయని ఇండియాస్పెండ్ టీమ్ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. గోరక్షణ పేరుతో గత ఎనిమిదేండ్లలో జరిగిన దాడులను ఈ టీమ్ అధ్యయనం చేయగా 97 శాతం మోదీ పాలనలోనే జరిగాయని తేలింది. అందులో సగానికి పైగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే జరిగాయి. గోరక్షకుల దాడుల్లో చనిపోయినవారిలో 86 శాతం మంది ముస్లింలే కావడం గమనార్హం.

గోరక్షకులు చివరికి మహిళలను కూడా వదలడం  లేదు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ పట్టణంలో ఇద్దరు ముస్లిం మహిళలు మాంసం తరలిస్తుంటే అది గోమాంసంగా భావించి వారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. వారి దగ్గరున్నది గోమాంసం కాదని, గేదె మాంసమని తర్వాత తేలింది. పోలీసులు దాడిచేసినవారిని వదిలిపెట్టి బాధిత మహిళలపైనే కేసుపెట్టారు. గోభక్తి పేరిట దాడులకు తెగబడడం సరికాదని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన తర్వాతే ఈ దాడి జరిగింది.

గత ఎనిమిదేండ్లలో 70 గోసంబంధ ఘటనలు దేశంలో జరిగితే అందులో 68 ఘటనలు (97 శాతం) మోదీ పాలనలోనే జరిగాయి. వీటిలో 38 ఘటనలు,  అంటే సగానికి పైగా (54 శాతం) బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే చోటుచేసుకున్నాయి. గోరక్షణ పేరిట జరిగిన దాడులకు ఎక్కువగా ముస్లింలే గురవుతున్నారు. 70 దాడుల్లో 36 ముస్లింలపైనే జరిగాయి. కొట్టిచంపిన ఘటనల మృతుల్లో 86 శాతం మంది ముస్లింలే.

ఈ దాడులపై కేంద్ర హోంశాఖ ఎలాంటి సమాచారం సేకరించడం లేదని  ప్రభుత్వం స్వయంగా లోక్‌సభలో ఈ సంగతి వెల్లడించింది. ఇలాంటి మూకుమ్మడి హత్యలపై ప్రత్యేక చట్టం తెచ్చే ఆలేచన ఏదీ లేదని కూడా ప్రభుత్వం మరో సందర్భంలో స్పష్టం చేయడం గమనార్హం. వింతైన విషయం ఏమిటంటే గోరక్షణ పేరిట జరిగిన దాడులలో సుమారు సగం కేసుల్లో (49 శాతం) బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టారు.