రిలయన్స్ జియో.. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి సంచలనాలనే సృష్టిస్తున్నది. ఆఫర్ల మీద ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది. అయితే జియో ఇకపై ఎలాంటి ఆఫర్లు ఇవ్వకపోయినా అందులోనే కొనసాగాలని చాలా మంది యూజర్లు అనుకుంటున్నారట. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ సర్వేలో ఈ విషయం తెలిసింది. ఈ సంస్థ జియో నెట్‌వర్క్‌ను వాడుతున్న యూజర్లను సర్వే చేసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
రిలయన్స్ జియో సిమ్‌లను తీసుకున్న వారిలో ఇప్పటికే 90 శాతం మందికి పైగా జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందారని సర్వే ద్వారా వెల్లడైంది. అలాగే ఆఫర్లు ఉన్నా, లేకపోయినా ఇప్పటికి వరకు జియోకు ఉన్న యూజర్లలో 76 శాతం మంది అందులోనే కొనసాగుతామని సర్వేలో చెప్పారు. రూ.303, రూ.309 ప్యాక్‌లను 84 శాతం మంది యూజర్లు వేసుకున్నారు. వీరందరూ రోజుకు 1 జీబీ 4జీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు, యాప్ సర్వీస్‌లను ఉచితంగా పొందుతున్నారు.
జియోను వాడుతున్న వారిలో 80 శాతం మంది కేవలం ఒక్క జియో సిమ్‌నే వాడుతున్నారట. 20 శాతం మందికి ఒకటి కన్నా ఎక్కువ జియో సిమ్‌లు ఉన్నాయట. ఇక జియో సిమ్‌లను చాలా మంది రిలయన్స్‌కు చెందిన లైఫ్ ఫోన్లు, ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లలోనే వాడుతున్నారట. ఇక మొత్తం మీద 41 శాతం మంది జియో యూజర్లకు ఇప్పటికీ కాల్స్ సరిగ్గా కనెక్ట్ అవడం లేదని సర్వే ద్వారా తెలిసింది. అయితే ఈ సమస్యను కూడా త్వరలో అధిగమిస్తామని జియో చెబుతున్నది.