//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గుంటూరు చదువులమ్మకి 50 వసంతాలు

Category : editorial

గుంటూరులో ప్రముఖ విద్యాసంస్థలో ఒకటి అయిన జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల (జేకేసీ) 50 వసంతాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవం జరుపుకుంది. ఫిబ్రవరి 3, 4 తేదీలలో జరుగుతున్న ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.

గుంటూరు, ప్రకాశం జిల్లాల గ్రామీణ విద్యార్థుల కోసం గుంటూరులోని కొందరు పెద్దలు సమావేశమై ఆచార్య నాగార్జునుడి పేరిట 1967లో నాగార్జున ఎడ్యుకేషన్‌ సొసైటి ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ కింద పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం ప్రదాన లక్ష్యం.

అయితే అలా మొదటగా ఏర్పాటు చేసిన విద్యా సంస్థే జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల. కుప్పుస్వామి గారు సామాజిక బాధ్యత కలిగిన గొప్ప భూస్వామి. గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్ష్యునిగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి పేరు గడించిన వ్యక్తి. కళాశాలకు ఆయన పేరు చేబ్రోలు హనుమయ్యగారు ప్రతిపాదించగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి, 1968లో జేకేసీ కళాశాలను ప్రారంభించారు.

అయితే వారి పేరుతో ప్రారంభించిన ఆ కళాశాల కి వ్యవస్థాపక అధ్యక్షులుగా జాగర్లమూడి చంద్రమౌళి, కార్యదర్శిగా ప్రముఖ శస్త్ర వైద్యులు డాక్టర్‌ కాసరనేని సదాశివరావు, కోశాధికారిగా ప్రముఖ వ్యాపారవేత్త యర్రమనేని ప్రకాశరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు ప్రముఖులు చేబ్రోలు హనుమయ్య, రాయపాటి సాంబశివరావు, గోగినేని కనకయ్య, హజీ సులేమాన్‌ఖాన్‌, గోల్డెన్‌ టుబాకో మంగళదాసు, మద్ది వెంకటరత్నం, నవభారత్‌ టుబాకో కంపెనీ ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు కళాశాల ప్రాభవానికి చేసిన కృషి అధ్యాపకులకు, విద్యార్థుకు ఒక మార్గదర్శకాన్నిచ్చింది.

అయితే కార్యదర్శి పనితనం వల్ల అధ్యాపకుల నియామకంలో ఎటువంటి తారతమ్యం లేకుండా జరిగింది. శాఖాధ్యక్షులుగా పేరూ అనుభవంవున్న వారిని ఇతర కళాశాలల నుంచి అధిక జీతాలు యిచ్చి ఆహ్వానించారు. ప్రకాశరావు సహాయంతో డాక్టర్‌ సదాశివరావు యాజమాన్యాన్ని ఒప్పించి రోసయ్యను ప్రిన్సిపాల్‌గా నియమించారు.

ప్రిన్సిపాల్ మొదలుకుని అధ్యాపకులు అందరు కష్టించే వారు కావడంతో ఫలితాలు ఎప్పుడూ తొంభై శాతానికి తగ్గలేదు. ముఖ్యంగా బై.పి.సి నుండి ప్రతి ఏటా ఇరవై మందికి తగ్గకుండా గుంటూరు మెడికల్‌ కాలేజిలో సీట్లు సంపాదించేవారు. గత యాభై ఏళ్ళలో ఎందరో ప్రతిభావంతుల్ని తయారు చేసింది ఈ విద్యా నిలయం.

వేల సంఖ్యలో విద్యార్ధులు డాక్టర్లు దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. వందల్లో ఇంజినీర్లు, చార్టర్డ్‌ ఎకౌంటెట్లు ఉద్యోగాల్లోనూ, ప్రైవేటు ప్రాక్టీషనర్స్‌గానూ స్థిరపడ్డారు. కొందరు రాజకీయాల్లో, మరికొందరు సామాజిక సేవలో రాణిస్తున్నారు. సినీరంగంలో కుడా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అంతేగాక జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో పలు పాఠశాలలు, జూనియర్‌ కాలే జీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు, ఇంజినీరింగ్‌, ఫార్మసి, బీయడ్‌ కాలేజీలు స్థాపించి విలువలుతో కూడిన విద్యనందిస్తున్నారు.

అంతేగాక విద్యార్థి దశలోనే అంతర్లీనమైన అభిరుచులను వెలికి తీసేందుకు సాహిత్య, సాంస్కృతిక, వ్యాయామ సమితులను అధ్యాపకుల, విద్యార్థుల సమన్వయంతో ఏర్పాటుచేసి తరచుగా ప్రదర్శించే అవకాశం పిల్లలకు కల్పించేవారు. గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, కాళోజి నారాయణ రావు, దివాకర్ల వెంకటావదాని, నాయని కృష్ణకుమారి, దాశరథి సోదరులు, సి. నారాయణ రెడ్డి, నటరాజ రామకృష్ణ, నాజర్‌ లాంటి వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు కళాశాల కార్యక్రమాలలో పాల్గొని విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు.

ఈ కార్యక్రమాల వల్ల లబ్దిపొందిన విద్యార్థులలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ పాపినేని శివశంకర్‌, ప్రముఖ సినీ దర్శకులు పోసాని కృష్ణమురళి, బోయపాటి శ్రీను లాంటివారున్నారు.