మందుల చీటీపై వైద్యులు రాసే రాత సామాన్య ప్రజలకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అలా రాసిన ముగ్గురు వైద్యులకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ కోర్టు లక్నవూ బెంచ్ రూ.5వేలు చొప్పున జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కోర్టు గంథ్రాలయానికి జమ చేయాలని ఆదేశించింది.
ఉన్నావ్, సీతాపూర్, గోండా జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల చేతిరాతకు సంబంధించి కొన్ని కేసులు నమోదయ్యాయి. వాటిని పరిశీలించిన న్యాయస్థానం సంబంధిత ఆసుపత్రి వైద్యులకు సమన్లు జారీ చేసింది. జరిమానా చెల్లించాల్సిందిగా అందులో ఆదేశించింది. అయితే దీనిపై వైద్యులు తమ చేతిరాతకు గల కారణాలు కోర్టుకు వివరించారు. తీవ్ర పని ఒత్తిడే అందుకు కారణమని తెలిపారు.
ఇక నుంచి ఇలాంటి వైద్య నివేదికలన్నీ అందరికీ అర్థమయ్యే భాషలోనే ఉండాలని ఉన్నతాధికారులకు న్యాయస్థానం సూచించింది. అవసరమైతే కంప్యూటర్లో టైప్ చేసి నివేదికలు ఇవ్వాలని వెల్లడించింది. పోస్ట్‌మార్టం నివేదికలను కేవలం మెడికల్ ప్రాక్టిషనర్లు మాత్రమే చదవగలుతున్నారని వెల్లడించింది. దాంతో ఆ నివేదికను ఇచ్చిన ప్రయోజనం పనికి రాకుండా పోతోందని వెల్లడించింది.