పాకిస్థాన్ లో లాహోర్ లోని ఎం.ఇస్లాం మెడికల్ అండ్ డెంటల్ కాలేజీలో చోటుచేసుకున్న ఘటన ఒకటి అక్కడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి తరగతి బయట ఇద్దరు విద్యార్థినులతో మాట్లాడాడు. దీనిని చూసిన కళాశాల యాజమాన్యం, అలా మాట్లాడాన్ని దుష్ప్రవర్తనగా భావించి 2000 రూపాయల జరిమానా విధించింది. తరగతి బయట ఒక అమ్మాయితో పిచ్చాపాటి మాట్లాడుతున్నావు అంటూ జరిమానా రశీదుపై పేర్కొనడం విశేషం.
ఇది 2017 డిసెంబర్ 28న చోటుచేసుకోగా, దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో అది వైరల్ గా మారింది. ఇదే కాలేజీలో చోటుచేసుకున్న మరో ఘటనకు సంబంధించిన వీడియో అప్ లోడ్ చేయగా, దానిలో ఇద్దరు విద్యార్థుల ఫోన్ లను రాళ్లతో పగులగొడుతుండడం కనబడుతోంది. ఈ రెండు అక్కడ వైరల్ కాగా, కాలేజీ యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.