బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 12మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. దీంతో పార్లమెంట్లో భారత సంతతి ఎంపీల సంఖ్య పెరిగింది. ఇంతకు ముందు 10 మంది ఉండేవారు. వారిలో ఎంపీగా గెలుపొందిన మొదటి సిక్కు మహిళ, తలపాగా ధరించిన మొదటి ఎంపీ వున్నారు.
కన్జర్వేటివ్‌ల కన్నా లేబర్ పార్టీ తరపునే భారత సంతతి వ్యక్తులు ఎక్కువమంది గెలుపొందారు. గతంలో లేబర్ పార్టీకి ఐదుగురు ఎంపీలు వుండగా ఇప్పుడు ఏడుకు చేరింది. కన్జర్వేటివ్ పార్టీ తరపున గతంలో మాదిరిగా ఐదుగురే ఇప్పుడు కూడా ఎన్నికయ్యాయరు. ఈ ఎన్నికల్లో బర్మింగ్‌హామ్ ఎడ్గ్బాస్టన్ నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రీత్ కౌర్ గిల్ అనే మహిళ గెలుపొందగా, తన్మన్జీత్ సింగ్ దేశాయ్ అనే సిక్కు కూడా లేబర్ పార్టీ తరఫున స్లో నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.
ప్రస్తుత ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వారు మొత్తం 56 మంది వివిధ పార్టీల తరఫున పోటీ చేశారు. లేబర్ పార్టీ భారతీయ మూలాలున్న 14 మందికి టికెట్లు ఇవ్వగా కన్సర్వేటివ్ పార్టీ 13 మందిని బరిలోకి దింపింది. 2015లో జరిగిన ఎన్నికల్లో (రద్దయిన సభ) ఈ రెండు పార్టీల తరఫున అయిదుగురు చొప్పున ఎన్నికయ్యారు.
బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్థానంలో ప్రీత్ కౌర్ గిల్ తన సమీప కన్సర్వేటివ్ అభ్యర్థిపై 6,917 ఓట్ల ఆధిక్యం సాధించింది. స్లావ్ స్థానంలో తన్మన్జీత్ సింగ్ దేసీ...కన్సర్వేటివ్ అభ్యర్థిని 16,998 ఓట్ల తేడాతో ఓడించాడు. కన్సర్వేటివ్‌ల తరఫున పోటీ చేసిన ప్రీతి పటేల్, అలోక్శర్మ, శైలేష్ వర, రిషి సునక్, సుయెల్లా ఫెర్నాండెజ్‌లు తమ స్థానాల్లో మరోసారి విజయం సాధించి సత్తా చాటుకున్నారు.
పలుదఫాలుగా లేబర్‌పార్టీ తరఫున విజయం సాధిస్తూ వస్తున్న కీత్ వజ్...లీచెస్టర్ ఈస్ట్‌పై మరోసారి తన పట్టును నిలుపుకున్నారు. ఇతని సోదరి వలేరీ వజ్ కూడా ఇదే పార్టీ తరఫున వాల్సోల్ సౌత్ స్థానం నుంచి తిరిగి ఎంపీగా విజయంసాధించారు.