//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు ఇక చౌక ధరకే...!

Category : state business

కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తయారీదారులకు, మధ్యతరగతి వినియోగదారులకు గొప్ప ప్రోత్సాహాన్నిచ్చింది కేంద్ర ప్రభుత్వం. టెలివిజన్లు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై 10 శాతం పన్నును తగ్గించింది వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి. శనివారం ఇక్కడ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 28వ సమావేశంలో ఏడాది కాలంగా ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ శానిటరీ నాప్కిన్లపై పన్నును పూర్తిగా ఎత్తివేశారు.

ప్రస్తుతమున్న 12 శాతం శ్లాబు నుంచి వీటిని తొలగించారు. రక్షాబంధన్ పండుగ రానున్న క్రమంలో రాఖీలపైనా పన్నును రద్దు చేశారు. మార్బుల్స్ తదితర ఉత్పత్తులనూ పన్ను నుంచి మినహాయించారు. అంతేగాక 17కుపైగా రకాల గృహోపకరణాలు, నిత్యం వినియోగించే వస్తువులపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతం శ్లాబులోకి మార్చారు. దీన్ని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లియెన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఎఎంఏ) అధ్యక్షుడు మనీశ్ శర్మ స్వాగతించారు.

అన్ని రకాల లెదర్ ఉత్పత్తులపై పన్నునూ 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. మరికొన్నింటిని 18 నుంచి 12 శాతానికి, ఇంకొన్నింటిని 5 శాతంలోకి చేర్చారు. చమురు కంపెనీల కోసం ఇథనాల్ ఆయిల్‌ను 18 నుంచి 5 శాతం శ్లాబులోకి తీసుకురాగా, దిగుమతి యూరియాపై పన్నును 5 శాతానికి దించారు. రూ.1,000దాకా విలువ కలిగిన పాదరక్షలకు 5 శాతం పన్నేనని ప్రకటించారు.

ఇంతకుముందు ఈ పరిమితి రూ.500 వరకే ఉన్నది. ఈ నెల 27 నుంచి నూతన జీఎస్టీ సవరణలు అమల్లోకి వస్తాయని సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ విలేఖరులకు తెలిపారు. చక్కెర సెస్సుపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. వచ్చే సమావేశంలో ఇది చర్చకు రానున్నదని సమాచారం. మొత్తంగా ఈసారి సమావేశంలో 88 ఉత్పత్తులపై పన్ను సవరణలను మండలి చేసిం ది. ఇదిలావుంటే జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్ ప్రక్రియ సరళతరానికీ ఆమోదం తెలుపగా, రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న వ్యాపారులు నెలకు బదులుగా మూడు నెలలకోసారి రిటర్నులు దాఖలు చేయాలి.

దీంతో జీఎస్టీ పరిధిలోని 93 శాతం మందికి ప్రయోజనం చేకూరనున్నది. ట్రాన్స్‌పోర్టర్ల ప్రయోజనార్థం త్వరలో జీఎస్టీ నెట్‌వర్క్‌తో ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను పరిచయం చేయనున్నది కేంద్ర ప్రభుత్వం. కాగా, తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి దాదాపు రూ.7,000 కోట్ల మేర ఆదాయం పడిపోతుందని అంచనా. జనవరిలోనూ 29 ఉత్పత్తులపై పన్ను రేట్లను జీఎస్టీ మండలి సవరించినది తెలిసిందే. గతేడాది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి రాగా, నవంబర్‌లో ఏకంగా 200లకుపైగా ఉత్పత్తులపై పన్నును తగ్గించిన సంగతీ విదితమే. తదుపరి కౌన్సిల్ సమావేశం ఆగస్టు 4న జరుగనున్నది.

Related News